Azadi ka Amrut Mahotsav: గాంధీ.. బ్రిటిష్‌ సైనికుడైన వేళ!

author img

By

Published : Oct 1, 2021, 7:09 AM IST

mahatma gandhi

గాంధీజీ అంటే అహింస! అలాంటి గాంధీ యుద్ధంలో పాల్గొన్నారంటే నమ్మగలరా? అదీ బ్రిటిష్‌ సామ్రాజ్యం తరఫున!!! అంతేకాదు ఆ సేవలకుగాను బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి పురస్కారం కూడా అందుకున్నారు. ఎప్పుడు? ఎలా? ఎందుకు? చదవండి!

లండన్‌లో లా చదివిన గాంధీ ఉద్యోగం కోసం 1893లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనేక అవమానాలు, వివక్షలు ఎదుర్కొంటూనే... క్రమంగా నాయకుడిగా ఎదుగుతున్న దశ అది! దక్షిణాఫ్రికాలోని భారతీయులు, కార్మికుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు తెలపటం ఆరంభించారు. ఆ సమయంలో వచ్చింది రెండో బోర్‌ యుద్ధం!

ఏమిటీ బోర్‌ యుద్ధం?

దక్షిణాఫ్రికాలోని డచ్‌ మాట్లాడే స్థానిక ప్రజల రాష్ట్రాలు బోర్‌ రిపబ్లిక్స్‌. ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ కూడా అలాంటిదే. అప్పటికే దక్షిణాఫ్రికాపై పట్టు సంపాదించిన బ్రిటన్‌ వీటిని కూడా స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో జరిగిందే బోర్‌ యుద్ధం (1899-1902)! ఈ యుద్ధంలో బోర్‌ రిపబ్లిక్స్‌, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ ఓడిపోయాయి. ఈ రాష్ట్రాల్లో భారీ ఎత్తున బంగారు, వజ్రాల వనరులుండటంతో వీటిపై పట్టుకోసం పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున పోరాడిన సైనికుల్లో అనేకమంది భారతీయ సిపాయిలే! ‘బ్రిటిష్‌ పౌరులకున్న హక్కులనే తమకూ ఇవ్వమని భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు. వాటిని ఇవ్వాల్సిన ప్రభుత్వం యుద్ధంలో పోరాడుతున్నప్పుడు వారికి మద్దతుగా నిలవటం భారతీయుల బాధ్యత’ అని భావించిన గాంధీజీ- యుద్ధంలో గాయపడ్డ సైనికులను స్ట్రెచర్లపై శిబిరాలకు, ఆస్పత్రులకు చేర్చి, చికిత్స చేయించేందుకు ఇండియన్‌ అంబులెన్స్‌ కోర్‌ను ఏర్పాటు చేశారు. బ్రిటన్‌ సైన్యంలో సార్జెంట్‌ మేజర్‌గా ఐదునెలల పాటు సేవలందించారు. వైద్య సేవలందించేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సేవలకు మెచ్చిన బ్రిటన్‌ ప్రభుత్వం 1915లో గాంధీ భారత్‌కు తిరిగి వచ్చాక కైసర్‌ -ఇ- హింద్‌ మెడల్‌తో ఆయన్ను సత్కరించింది. (జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటన తర్వాత దాన్ని గాంధీజీ తిరిగి ఇచ్చేశారు.)

బ్రిటిష్‌ సామ్రాజ్యంపై పోరుబాటలో ఇంకా స్పష్టతరాని సమయమైన బోర్‌ యుద్ధంలోనే కాదు... భారత్‌కు వచ్చి స్వాతంత్య్రోద్యమ బరిలోకి దిగాక కూడా గాంధీజీ తెల్లవారికి మద్దతుగా నిలిచారు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌కు మద్దతు పలకటమేగాకుండా సిపాయిలుగా వెళ్లాలని భారతీయులకు పిలుపునిచ్చారు. తాను పర్యటించిన ప్రతిచోటా ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ తరఫున పాల్గొనటానికి యువకులను ప్రోత్సహించారు. ఈ నియామకాల కోసం తన చేతి నుంచి డబ్బు విరాళంగా ఇచ్చారు కూడా! అయితే ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. తొలి ప్రపంచ యుద్ధంలో నెగ్గగానే భారత్‌కు స్వతంత్ర ప్రతిపత్తి (సెల్ఫ్‌ డొమెనియన్‌) హోదా ఇస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వం సంకేతాలు పంపించింది. అందుకే గాంధీజీతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా యుద్ధ సమయంలో బ్రిటన్‌కు మద్దతు పలికారు. కానీ... యుద్ధానంతరం ఆంగ్లేయ ప్రభుత్వం మాట తప్పింది. స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోగా భారతీయులపై కఠిన ఆంక్షలు విధించింది. ఫలితంగా గాంధీజీకి వారిపై మనసు పూర్తిగా విరిగింది. అక్కడి నుంచి ఉద్యమాన్ని తీవ్రం చేశారు.

"సైనిక బలగాల్లో చేరటం మన స్వయం పాలన దిశగా కీలక అడుగు. ఈ దళాల్లో చేరటం వల్ల స్వీయ రక్షణ ఎలాగో మనకు తెలుస్తుంది! ఇప్పుడు మిలిటరీలో చేరడం రాబోయే రోజుల్లో మనకు ఉపయోగ పడుతుంది."

- గాంధీజీ!

ఇదీ చదవండి: Azadi ka Amrut Mahotsav: కలెక్టర్​ హోదాలో ఉన్నా అడుగడుగునా వివక్షే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.