'నాన్న నన్నెవరో కిడ్నాప్ చేశారు.. రూ.2 లక్షలు ఇవ్వకపోతే నీ కొడుకు ఖతం'.. తండ్రిని బెదిరించిన కొడుకు

author img

By

Published : Jan 21, 2023, 12:47 PM IST

The son demanded money from his father  in uttarapradesh

వేరే వాళ్లని కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసేది మనం సినిమాల్లో చూసుంటాం. కానీ తనను కిడ్నాప్ చేశారంటూ కన్న తండ్రి నుంచే డబ్బులు వసూలు చేయండం ఎక్కడా విని ఉండం.. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ వ్యక్తి మాత్రం తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ తండ్రికి ఫోన్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ యువకుడు.

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ఓ వింత సంఘటన జరిగింది. తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రికి ఫోన్​ చేసి రూ. 2 లక్షలు డిమాండ్​ చేశాడు ఓ కుమారుడు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల అసలు విషయం బయటకు వచ్చింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జ్యోతిష్ తివారీ కుమారుడు అభిషేక్ తివారీ శివకుటి ప్రాంతంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. శుక్రవారం తన తండ్రికి ఫోన్​ చేసి తనను కొందరు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేసి ఏదో నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్లారని చెప్పాడు. తర్వాత జ్యోతిష్ తివారీకి రూ. 2 లక్షలు ఇవ్వాలని ఫోన్ వచ్చింది. డబ్బులు ఇవ్వకపోతే కొడుకును చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో భయపడిపోయిన జ్యోతిష్.. ప్రయాగ్​రాజ్ వెళ్లి కొడుకు ఆచూకీ కోసం ప్రయత్నించాడు. ఎంత వెతికినా కొడుకు సమాచారం దొరకకపోవడం వల్ల చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు జ్యోతిష్.

తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఫోన్​ నంబర్​ను ట్రేస్ చేసిన పోలీసులు అభిషేక్​ తివారీని పట్టుకోగలిగారు. అనంతరం దర్యాప్తులో అభిషేక్​ తివారీ కిడ్నాప్ అయినట్లుగా డ్రామా ఆడాడని తేలింది. తర్వాత అతడిని విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫేస్​బుక్ పరిచయం
అభిషేక్​కు ఫేస్​బుక్​లో అంకిత శర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత అభిషేక్​ నుంచి వాట్సాప్ నంబర్ తీసుకుంది. ఒకరోజు ఉన్నపాటుగా అతడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది. దాంతో భయపడిన అభిషేక్​ వెంటనే కాల్ కట్​ చేశాడు. అయితే ఆ న్యూడ్ వీడియో కాల్​ను రికార్డు చేశారు ఒక బ్లాక్​మెయిలర్. ఆ తర్వాత నుంచి బ్లాక్​మెయిలర్ అభిషేక్​కు కాల్​ చేసి డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్​ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. భయపడిన అభిషేక్ ఒకసారి రూ. 30,000 ఇచ్చాడు. అనంతరం బ్లాక్​మెయిలర్ తరచుగా ఫోన్​చేసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. భయపడిన అభిషేక్​.. బ్లాక్​మెయిలర్​కు డబ్బులు ఇవ్వడం కోసం తన తండ్రితో కిడ్నాప్ డ్రామా ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. ఏం చేయాలో తెలియక తండ్రి నుంచి 2 లక్షలు డిమాండ్ చేశానని చెప్పాడు.

దీని తర్వాత పోలీసులు అభిషేక్ నుంచి బ్లాక్​మెయిలర్ నంబర్ తీసుకున్నారు. బ్లాక్​మెయిలర్ మీద కూడా కేసును నమోదు చేశారు. డీసీపీ సంతోష్ కుమార్ మీణా మాట్లాడుతూ..'ఇలాంటి ఫ్రాడ్, బ్లాక్​మెయిలింగ్ కాల్స్​కు ఎవరూ భయపడకూడదని చెప్పారు. అలాంటి కాల్స్ ఎప్పుడైనా వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.