యంగెస్ట్ CEO.. 13ఏళ్లకే 56 కంపెనీలకు బాస్.. మ్యాట్రిమోని నుంచి క్రిప్టో సేవల వరకు..

author img

By

Published : Aug 3, 2022, 5:32 PM IST

suryansh

CEO of 56 companies: తొమ్మిదో తరగతిలోనే తొలి కంపెనీ.. ఏడాది తిరిగే సరికి 56 కంపెనీలకు యజమాని.. ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈఓగా రికార్డు.. ఇవన్నీ ఒక్కరి గురించే.. ఇంత చిన్న వయసులో ఇన్ని ఘనతలు సాధించింది ఎవరంటే?

13 ఏళ్లకే 56 కంపెనీలు.. యంగెస్ట్​ సీఈఓగా ఘనత

CEO of 56 companies: బిహార్ ముజఫర్​పుర్​కు చెందిన టీనేజర్.. 13ఏళ్లకే 56 కంపెనీలు స్థాపించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపిన్న సీఈఓగా రికార్డుకెక్కిన ఈ బాలుడు.. మొత్తం 56 కంపెనీలను నడిపిస్తున్నాడు. కట్రా బ్లాకులోని అమ్మ గ్రామానికి చెందిన సూర్యాన్ష్.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. రోజుకు 17-18 గంటలు పనిచేస్తూ.. కొత్తకొత్త కంపెనీలకు జీవం పోస్తున్నాడు. డెలివరీ, మ్యాట్రిమోనీ సేవల నుంచి క్రిప్టోకరెన్సీ వంటి క్లిష్టమైన ఆర్థిక సేవల వరకు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తున్నాడు.

"సూర్యవంశ్ కాంటాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్​లో 56కు పైగా నమోదిత స్టార్టప్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రిజిస్టర్ కావాల్సి ఉంది. 'మంత్రా ఫై' అనేది క్రిప్టో కరెన్సీ కంపెనీ సంస్థ. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేని వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ బిజినెస్ అనేది క్విక్ కామర్స్ సంస్థ. ఓలా తరహాలో జిప్సీ క్యాబ్స్, కులాంతర వివాహాల కోసం షాదీ కరో అనే మ్యాట్రిమోని కంపెనీ స్థాపించా. ఇన్ని కంపెనీలు స్థాపించడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది."
-సూర్యాన్ష్, 56 కంపెనీల సీఈఓ

ఆన్​లైన్ కంపెనీ స్థాపించాలన్న ఆలోచనను తండ్రితో పంచుకున్న సూర్యాన్ష్.. వారి ప్రోత్సాహంతో క్విక్-కామర్స్ కంపెనీని స్థాపించాడు. క్లాసుల​కు వెళ్లలేకపోయినా.. స్కూల్ యాజమాన్యం తనకు అన్ని విషయాల్లోనూ మద్దతుగా ఉంటోందని సూర్యాన్ష్ చెబుతున్నాడు. ప్రస్తుతానికైతే ఈ కంపెనీల నుంచి తనకు రాబడి లేదని, అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే ఆదాయం వస్తుందని చెప్పాడు. భవిష్యత్​లో కామర్స్ రంగంలో చదువు కొనసాగిస్తానని వివరించాడు.

"నా తల్లిదండ్రులు నాకు చాలా ప్రోత్సాహం అందించారు. వారి సహకారంతోనే నేను 56 స్టార్టప్​లను నెలకొల్పాను. ఇకపైనా మరిన్ని సంస్థలు స్థాపించి, వాటికి సీఈఓ అవుతాను. మా పెద్ద మామయ్య సీఏ. నా తండ్రి ఆడిటింగ్ రంగంలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఫలితంగా ఫైనాన్స్ రంగం గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. వారివల్లే నేను ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈఓ అవ్వగలిగాను. ప్రస్తుతం నేను పదో తరగతి చదువుతున్నా. భవిష్యత్​లో కామర్స్ విభాగంలో చదువు కొనసాగిస్తా."
-సూర్యాన్ష్, 56 కంపెనీల సీఈఓ

తన కంపెనీకి మరో ఐదుగురు సహ వ్యవస్థాపకులు ఉన్నారని సూర్యాన్ష్ చెప్పాడు. త్వరలోనే 5-6 స్టార్టప్​లను ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ఎవరినో చూసి స్ఫూర్తి పొందాల్సిన అవసరం లేదని.. తమకు తాముగానే ప్రేరణ పొందాలని యువతరానికి సందేశం ఇస్తున్నాడు.

సూర్యవంశ్ తల్లిదండ్రులు.. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా నడిచే ఎన్​జీఓ నడుపుతున్నారు. 13ఏళ్లకే తమ కుమారుడు ఆడిటింగ్ రంగంలోకి అడుగుపెట్టాడని అతడి తల్లి చెప్పారు. తొమ్మిదో తరగతిలో తొలి కంపెనీ ప్రారంభించాడని చెప్పారు. నిజానికి సూర్యాన్ష్ పేరుమీద అతడి తల్లి 2014లోనే కంపెనీని రిజిస్టర్ చేయించారు. ఆ సంస్థకు అనుబంధంగానే సూర్యాన్ష్ తాజాగా స్టార్టప్​లు ప్రారంభించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.