'ఇల్లు కట్టుకోవడానికి డబ్బులడిగినా వరకట్నం డిమాండ్‌ చేయడమే'

author img

By

Published : Jan 12, 2022, 7:31 AM IST

sc

Supreme Court On Dowry Demand: వరకట్నానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త కోరడం కూడా వరకట్న వేధింపుల కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

Supreme Court On Dowry Demand: ఇంటి నిర్మాణం నిమిత్తం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను కోరడం వరకట్నం డిమాండ్‌ చేయడం కిందకే వస్తుందని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేరానికి భారత శిక్షా స్మృతిలోని 304-బి నిబంధన కింద శిక్ష వర్తిస్తుందని తెలిపింది. కట్నం వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు మృతిచెందిన కేసులో- ఆమె భర్త, మామలకు విచారణ న్యాయస్థానం శిక్ష విధించడం సరైనదేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు తప్పుగా భావించిందని పేర్కొంది.

ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ... అదనపు కట్నం కోసం భర్త, మామలు పెడుతున్న వేధింపులు తాళలేక అత్తింటిలోనే ఆత్మహత్య చేసుకొంది. దీంతో వారిద్దరిపై కట్నం వేధింపులు, వరకట్న మరణం, ఆత్మహత్యకు ప్రేరేపించడం (ఐపీసీ 498-ఎ, 304-బి, 306 నిబంధనలు) కింద ఆరోపణలు నమోదయ్యాయి. విచారణ న్యాయస్థానం దోషులిద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే, వారు దీన్ని సవాలుచేస్తూ హైకోర్టుకు వెళ్లగా... ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు అడిగారంటూ శిక్షను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ వ్యవహారంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ సాగించింది. ఏదైనా ఆస్తిని లేదా 'వాల్యుబుల్‌ సెక్యూరిటీ'ని అడగడమూ వరకట్నం నిర్వచనం పరిధిలోకే వస్తాయంది. ఈ విషయంలో హైకోర్టు పొరపడిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో వేళ్లూనుకున్న చీడను రూపుమాపాలన్నదే చట్టం తాలూకా మూల ఉద్దేశమన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలంది. విచారణ న్యాయస్థానం దోషులకు శిక్ష విధించడం సరైనదేనని స్పష్టం చేసింది. అయితే శిక్షా కాలాన్ని ఏడేళ్లకు కుదిస్తున్నట్టు తెలిపింది.

విద్వేష ప్రసంగాలపై విచారణ నేడు

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, దిల్లీలలో విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొనేలా, దర్యాప్తు జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:

'అక్కడ చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.