ETV Bharat / bharat

Margadarsi: 'మార్గదర్శి' చందాదారుల అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు

author img

By

Published : Jul 18, 2023, 6:55 AM IST

Margadarsi: 'మార్గదర్శి' చిట్‌ ఫండ్‌పై చందాదారుల అనుబంధ పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిజంగా చందాదారుల ప్రయోజనం కోసమైతే.. ముందుగా నోటీసులిచ్చి వివరణ ఎందుకు తీసుకోలేదని చందదారుల తరఫున న్యాయవాదులు ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇవ్వాలని చట్టంలో లేదని ప్రభుత్వం, చిట్‌ రిజిస్ట్రార్ల తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. చిట్‌గ్రూపులను కొనసాగించుకునేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలా లేదా అనే విషయంలో నిర్ణయం ఇవాళ వెల్లడిస్తామని తెలిపింది.

Margadarsi
మార్గదర్శి

'మార్గదర్శి' చందాదారుల అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు

Margadarsi: 'మార్గదర్శి' సంస్థకు చెందిన కొన్ని చిట్‌గ్రూపుల నిలిపివేతకు.. చిట్‌ రిజిస్ట్రార్లు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ చందాదారుల అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. విచారణలో ఏపీ ప్రభుత్వం, చిట్‌ రిజిస్ట్రార్ల తరఫున.. అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. చిట్‌గ్రూపుల నిలిపివేతకు.. ముందుగా నోటీసులివ్వాలనే నిబంధన.. చట్టంలో లేదన్నారు. చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల ఉల్లంఘన కారణంగా నిలిపివేతకు.. రిజిస్ట్రార్లు నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఫిర్యాదులు అందకపోయినా ప్రభుత్వం రెగ్యులేట్‌ చేయవచ్చన్నారు. ఉత్తర్వులను, నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని కోరారు. చందాదారుల తరఫున.. సీనియర్‌ న్యాయవాదులు మీనాక్షీ అరోడా, పోసాని వెంకటేశ్వర్లు.. ప్రతివాదనలు వినిపించారు. చందాదారుల ప్రయోజనాల కోసం చిట్‌గ్రూపులను నిలిపివేశామని.. ఏజీ చెప్పడంలో అర్థం లేదన్నారు. నిజంగా చందాదారుల ప్రయోజనం కోసమైతే.. ముందుగా నోటీసులిచ్చి వివరణ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఫిర్యాదులే లేనప్పుడు.. సుమోటోగా అధికారాన్ని వినియోగించి.. గ్రూపులను ఎందుకు నిలిపివేశారన్నారు. చిట్‌కంపెనీ ఫోర్‌మెన్‌గా వ్యవహరిస్తున్నప్పుడు చందాదారుల సొమ్ముకు.. కంపెనీ బాధ్యత వహిస్తుందని, చందాదారుల సొమ్ముకు.. పూర్తిస్థాయిలో భద్రత ఉందని వివరించారు. మార్గదర్శి ఆర్థిక స్థితిగతులపై.. పిటిషనర్లు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. చందాదారులకు నోటీసులివ్వకుండా.. చిట్‌ రిజిస్ట్రార్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పునరుద్ఘాటించారు.

చందాదారులకు నోటీసులివ్వకపోవడంతో.. వారి హక్కులకు భంగం కలిగిందన్నారు. చిట్‌గ్రూపులను కొనసాగించుకునేలా.. మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులివ్వాలా లేదా అనే విషయం.. నేడు వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది. నిలిపివేసిన చిట్‌ గ్రూపుల పర్యవేక్షణకు "రిసీవర్‌ " విషయంలో ఈ లోపు సంయమనం పాటించాలని ప్రభుత్వానికి మౌఖికంగా స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.