ETV Bharat / bharat

ఫోన్లోనే విడాకులు.. భార్యకు ఒక్క రూపాయి పరిహారం​.. పంచాయతీ వింత తీర్పు

author img

By

Published : Apr 3, 2022, 2:39 PM IST

భార్య నుంచి విడాకులు తీసుకోవాలని ఓ వ్యక్తి పంచాయతీని ఆశ్రయించాడు. ఆమెకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అతనికి విడాకులు ఇప్పించారు అక్కడి పెద్దలు. కేవలం ఒక్క ఫోన్​కాల్​తో ఈ ప్రక్రియ అంతా ముగిసింది. ఈ విడాకులకు బాధితురాలి తండ్రి కూడా ఒప్పుకున్నాడు. ఇందుకు అతను తీసుకున్న భరణం.. ఒక్క రూపాయి!

Man Divorced Wife
విడాకులు

ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా ఓ వ్యక్తికి అతని భార్య నుంచి విడాకులు ఇప్పించారు అక్కడి కులపెద్దలు. పంచాయతీకి అతని భార్య రాకపోయినా.. ఆమెకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫోన్లోనే భర్త నుంచి విడాకులు ఇప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఆమె తండ్రి కూడా ఒప్పుకున్నాడు. విచిత్రం ఏంటంటే అతను కేవలం ఒక్క రూపాయి భరణానికి తన కూతురుకు అల్లుడు విడాకులు ఇచ్చేందుకు సరే అనడం. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్​ జిల్లా సిన్నర్​ ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది.. సిన్నర్​కు చెందిన బాధితురాలికి కొంతకాలం క్రితం అహ్మద్​నగర్​ జిల్లా లోనీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. కానీ భర్త వేధింపులను తట్టుకోలేక ఆమె కొద్ది రోజులకే పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులైనా ఆమె తిరిగి రాకపోవడం వల్ల ఆమెకు విడాకులు ఇవ్వాలని భర్త నిర్ణయించుకున్నాడు. కానీ ఇందుకు అతను చట్టపరంగా ఎవరినీ సంప్రదించకుండా నేరుగా పంచాయతీని ఆశ్రయించాడు.

వైదు సామాజిక వర్గానికి చెందిన పెద్దల సమక్షంలో ఆ మహిళ లేకుండానే ఈ విచారణ జరిగింది. ఆమెకు ఈ విషయంపై అసలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విచారణ జరిపిన అనంతరం భర్త కోరిన విధంగా విడాకులు మంజూరు చేస్తున్నామని.. భరణంగా భర్త ఒక్క రూపాయి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఇది జరగడానికి ఎనిమిది రోజులు ముందే ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. పంచాయతీ పెద్దలు అడ్డుకోవటం, ఆమె ఆర్థిక స్థితి బాగాలేకపోవడం వల్ల బాధితురాలు కోర్టును ఆశ్రయించలేకపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ముతామటీ అభియాన్​కు చెందిన సామాజిక కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు. వారి సూచన మేరకు బాధితురాలు.. భర్త, అతని కుటుంబసభ్యులు సహా తీర్పును ఇచ్చిన పంచాయతీ పెద్దలపై ఫిర్యాదు చేసింది.

ఇదీ చూడండి: మానవత్వం నిలిపిన ప్రాణం.. పసిగుండెను కాపాడేందుకు తరలిన జనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.