ETV Bharat / bharat

మరో సీఎం మార్పు.. భాజపా కసరత్తు!

author img

By

Published : Sep 14, 2021, 5:09 PM IST

Updated : Sep 14, 2021, 6:55 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ దిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం భాజపా సీనియర్​ నేతలతో ఆయన భేటీకానున్నారు(jai ram thakur news). అయితే ఠాకూర్​ను సీఎం పదవి నుంచి తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలే కర్ణాటక, గుజరాత్​లో సీఎంలను పార్టీ మార్చడం ఇందుకు కారణం.

Himchal Pradesh CM
జైరాం ఠాకూర్​

మొన్న ఉత్తరాఖండ్​ సీఎం, నిన్న కర్ణాటక సీఎం, నేడు గుజరాత్​ సీఎం.. కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చేసింది భాజపా హైకమాండ్​. దీంతో నెక్ట్స్​ ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి తొందరలోనే సమాధానం లభించే సూచనలు కనిపిస్తున్నాయి! హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్.. హడావుడిగా దిల్లీ వెళ్లడం ఇందుకు కారణం(jai ram thakur news).

ఠాకూర్​ సహా హిమాచల్​ప్రదేశ్​ భాజపా బృందాన్ని దిల్లీకి పిలిపించింది అధిష్ఠానం. ఠాకూర్​​.. వారం రోజుల్లో దిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 8న దేశ రాజధానికి వెళ్లిన ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు.

తాజా పర్యటనలో.. ఠాకూర్ భాజపా హైకమాండ్​తో మారోమారు చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ హిమాచల్​ప్రదేశ్​ ఇంఛార్జ్​ అవినాశ్​ రాయ్​ ఖన్నా, సహ ఇన్​ఛార్జ్​ సంజయ్​ టాండన్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్​ కశ్యప్​, సంస్థాగత ప్రధాన కార్యదర్శి పవన్​ రాణా పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఉపఎన్నికలపై సుదీర్ఘ మంతనాలు జరగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్​ విమర్శలు...

అవకాశాన్ని ఉపయోగించుకున్న రాష్ట్ర కాంగ్రెస్​.. భాజపాపై విమర్శల వర్షం కురిపించింది. ఠాకూర్​ను తొలగించేందుకే దిల్లీకి పిలిపించారని ఎద్దేవా చేసింది. ఈ విషయాన్ని భాజపా చేపట్టిన 'జన్​ ఆశీర్వాద్​ యాత్ర'లో కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్ ఇప్పటికే​ సూచనప్రాయంగా చెప్పేశారని వ్యాఖ్యానించింది.

గుజరాత్​.. కర్ణాటకలో..

గుజరాత్​ సీఎంగా విజయ్​ రూపానీ(vijay rupani resignation) శనివారం రాజీనామా చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. రూపానీ వారసుడెవరు? సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు? అని సర్వత్రా చర్చలు జరిగాయి(gujarat cm news). దీనికి ముగింపు పలుకుతూ భూపేంద్ర పటేల్​ను తదుపరి సీఎంగా ప్రకటించింది భాజపా. 59ఏళ్ల భూపేంద్ర.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

కొవిడ్​ కట్టడిలో వైఫల్యం, పటీదార్లలో అసంతృప్తి కారణంగా విజయ్​ రూపానీని అధిష్ఠానం తప్పించినట్టు తెలుస్తోంది. 2022 చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

జులైలో.. కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. ఆ రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చాలా కాలం పాటు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని యడ్డీ ఎప్పటికప్పుడు చెబుతూనే వచ్చారు. హైకమాండ్ ఆదేశాలతోనే చివరకు పదవిలో నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- Assembly Election 2022: నాయకత్వ మార్పుతో ఎన్నికలకు సన్నద్ధం!

Last Updated :Sep 14, 2021, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.