ETV Bharat / bharat

Chandrababu Naidu chit chat: "జగన్ మూర్ఖత్వానికి రాష్ట్రం బలికావాలా..? త్వరలో పల్లె నిద్ర"

author img

By

Published : Jul 12, 2023, 12:37 PM IST

Updated : Jul 12, 2023, 6:01 PM IST

Chandrababu Naidu chit chat: దగాపడిన ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. బీజేపీతో పొత్తుపై మీడియా ప్రశ్నించగా.. రాష్ట్ర విచ్ఛిన్నంపై ప్రజల్లో చైతన్యం తెచ్చి సరిదిద్దటమే.. తనకిప్పుడు ప్రధాన లక్ష్యమని బదులిచ్చారు. అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల వ్యవస్థను పరిమితం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Etv Bharat
Etv Bharat

TDP leader Chandrababu Naidu chit chat: వాలంటీర్ల రాజకీయ జోక్యం.. దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ఉండవల్లి నివాసంలో మీడియా ప్రతినిధులతో 3గంటలపాటు ఇష్టాగోష్టి నిర్వహించారు. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలకు సంబంధించి స్పందన కోరగా.. వ్యక్తిగత సమాచార సేకరణ ద్రోహమని.. చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజాసేవ వరకే వాలంటీర్లు పరిమితం కావాలన్నారు. తానేం చేశానో ప్రజలు చూశారని.. నాలుగేళ్లుగా జగన్ ఏం చేస్తున్నాడో బేరీజు వేసుకున్నారన్న చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఏం చెబుతున్నాడో వింటున్నారని అన్నారు.

పొత్తులపై ఏం అన్నారంటే: బీజేపీతో టీడీపీ పొత్తుంటుందని కేంద్ర మంత్రి చెప్పారనగా.. ఎదుటివారొకటని, తాను మరొకటని గందరగోళం సృష్టించడం తనకిష్టం లేదన్నారు. ప్రచారాలపై స్పందించి చులకన కాదల్చుకోలేదన్నారు. ఎన్నికలప్పుడే రాష్ట్ర ప్రయోజనాలకనుగుణంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. ప్రభుత్వం, ప్రజలు గట్టిగా ఉంటే.. కేంద్రం దిగొస్తుందనేందుకు జల్లికట్టు ఘటనే ఉదాహరణగా చూపిన చంద్రబాబు.. జగన్‌ ఆ స్థాయి పోరాటానికి కనీస ప్రయత్నం చేయలేదన్నారు. ఓట్ల అవకతవకలపై దిల్లీనీ వదిలిపెట్టకుండా పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. అక్రమాలు సరిదిద్దకపోతే ఈసీ విశ్వసనీయత కోల్పోతుందున్నారు.

ఏసుక్రీస్తు సూక్తులకు విరుద్ధంగా జగన్‌ పాలన: జగన్‌ ఎంత దుర్మార్గుడు కాకుంటే.. సంపద సృష్టించే అమరావతిని చంపేస్తాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక మనిషి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మాదిరి అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారేదన్నారు. జీవనాడి పొలవరాన్ని ముంచేసినా ప్రజా చైతన్యం కొరవడిందన్నారు.

ప్రకృతి వనరులు, ప్రైవేటు ఆస్తులు దోచేస్తూ...కబ్జాలు, సెటిల్మెంట్లతో వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏసుక్రీస్తు సూక్తులకు విరుద్ధంగా జగన్‌ పాలన సాగుతుందని.. ప్రజా సంపద నాశనం చేసి, అప్పు చేయమని ఖురాన్ ఏమైనా చెప్పిందా అని నిలదీశారు. ప్రజల్ని హింసించి పైశాచిక ఆనందం పొందాలని.. ఏ మతం చెప్పిందో జగన్‌ చెప్పాలని చంద్రబాబు అన్నారు.

అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి: కృష్ణా, గోదావరి నదుల్ని సక్రమంగా వినియోగించుకుంటే 2 రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు నీళ్లివ్వొచ్చన్నారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గితే.. ఏపీలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, వారి జీవన విధానం మారేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

రుషికొండపై జగన్‌ కట్టుకునే విలాసవంతమైన భవనం కోసం దేశ విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పిస్తున్నారని.. చంద్రబాబు ఆరోపించారు. 500 నోట్లు రద్దు చేస్తే ఎన్నికల్లో డబ్బులు పంచే శని వదిలిపోతుందన్నారు. విద్యుత్‌ సంస్కరణ వల్ల 2004లో అధికారం పోయినా... రాష్ట్రం బాగుపడిందన్నారు. యూనిట్ విద్యుత్ రూపాయన్నరకే అందించే వ్యవస్థను జగన్‌ ధ్వంసం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

మార్గదర్శిపై కుట్ర: ఈనాడుపై కోపంతో దశాబ్దాల చరిత్ర ఉన్న మార్గదర్శిని ఆంధ్రప్రదేశ్​లో దెబ్బతీసే కుట్ర చేయటంతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో నూ దెబ్బకొట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శి చందాదారులకు నోటీసులిచ్చే అధికారం సీఐడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తప్పు చేస్తున్నావని సీఐడీ చీఫ్ సంజయ్‌కి ఎంత మంది హితవు చెప్పినా వినకుండా అనవసర జోక్యానికి పోయి ఇబ్బందులు తెచ్చుకున్నాడని విమర్శించారు. మానసిక ఆందోళనలతో ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యాడన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావుకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. అత్యున్నత పురస్కారాలు పొందినవారిని ఇలా ఇబ్బంది పెడుతుంటే.. దేశం ఇక ఎటు పోవాలని మండిపడ్డారు.

వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు: మేనిఫెస్టోలో మహిళలకు ఇప్పటి వరకు ప్రకటించిన 4 పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసే యోచనలో ఉన్నామన్న చంద్రబాబు.. కుటుంబం - సమాజం రెండూ బాగుపడేలా చూస్తామన్నారు. కట్టెల పొయ్యితో తన తల్లి పడిన కష్టాలు చూసే.. దీపం పథకం తెచ్చామన్న చంద్రబాబు.. పెరిగిన ధరలతో ఇబ్బంది పడే మహిళల కోసమే.. 3 సిలిండర్లు ప్రకటించామని వివరించారు.

అమెరికా ఇప్పటివరకూ మహిళా అధ్యక్షురాలిని చూడలేదన్న చంద్రబాబు.. ఈ విధానం పోవాలనే మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించినట్లు వివరించారు. బీసీల రుణం తీర్చుకునేందుకే రక్షణ చట్టం తెస్తున్నట్లు ప్రకటించారు. పూర్ టు రిచ్ విధానం అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమైనా... అద్భుత ఫలితానిస్తుందన్నారు. మినీ మేనిఫెస్టోను.. ప్రతి 5 వేల ఇళ్లకు ఇన్‌ఛార్జిలు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

Last Updated :Jul 12, 2023, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.