ETV Bharat / bharat

'శిందే సేన'లో టెన్షన్.. NCP చేరికపై ఎమ్మెల్యేల అసంతృప్తి.. 18 మంది జంప్?

author img

By

Published : Jul 7, 2023, 6:43 AM IST

Updated : Jul 7, 2023, 8:04 AM IST

Shinde vs Ajit pawar : ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో అలజడి రేపుతోంది. ఆ వర్గం ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు ఏక్​నాథ్ శిందే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ మధ్య చర్చలు జరిగాయి.

maharashtra crisis
maharashtra crisis

Maharashtra Crisis : మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గం చేరడం ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో అలజడి రేపుతోంది. శిందే శివసేన MLAలు, MLCలు, MPల్లో తీవ్ర అసంతృప్తి రాజేస్తోంది. అజిత్‌ వర్గం రాకతో.. బీజేపీ, శివసేనలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు భంగపాటుకు గురవుతున్నారు. అజిత్‌ వర్గం కలుస్తుందని ముందే తెలుసా అని ఓ MLA శిందేను ప్రశ్నించగా.. ఏ ఆందోళన అవసరం లేదని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్‌ రాకతో ప్రభుత్వం ఇంకా బలంగా మారిందని సొంత నేతలకు శిందే సర్ది చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తాను దిగిపోతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని శిందే స్పష్టం చేశారు.

"ముఖ్యమంత్రిగా నేను దిగిపోవడం లేదు. అవన్నీ పుకార్లే. ఎన్​సీపీలో ఏం జరుగుతుందో? వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మా ఎమ్మెల్యేలు, ఎంపీలతో నేను మాట్లాడాను. మన ప్రభుత్వం మరింత బలంగా మారుతోందని వారికి చెప్పాను. మూడు పార్టీలతో కలిసి మా బలం ఇప్పుడు 200కు మించింది. ఏ నాయకుడు కూడా అసంతృప్తితో లేరు. అందరికీ మాపై నమ్మకం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పూర్తి అండదండలు మాపై ఉంటాయి."
-ఏక్​నాథ్ శిందే, ముఖ్యమంత్రి

Sanjay Raut vs Eknath Shinde : అజిత్‌ పవార్​ చేరికతో శిందే వర్గంలో తిరుగుబాటు మొదలైందని శివసేన (ఉద్ధవ్‌ వర్గం) పేర్కొనడం కలవరం రేపింది. శిందే వర్గంలోని 17 నుంచి 18 మంది MLAలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. శిందే ప్రభుత్వంలో తిరుగుబాటు ప్రారంభమైందనీ.. చాలామంది తమ సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు. శిందేసహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. ఆ తర్వాత అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి అవుతారని ఠాక్రే వర్గం ప్రచారం చేస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేశారు. శివసేన ప్రజాప్రతినిధుల సమావేశంలో కొంత మంది అజిత్‌ పవార్‌ చేరికపై అనుమానాలను వ్యక్తం చేశారు. పలు అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. అధికార శివసేనలో కలకలం రేగిన క్రమంలో ఏక్‌నాథ్‌ శిందేతో.. డిప్యూటీ CM దేవేంద్ర ఫడణవీస్‌ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు.

మరోవైపు, ఉద్దవ్​ వర్గం నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుపై ప్రతిపక్షాలు పుకార్లు సృష్టిస్తున్నాయన్నారు. ఏక్​నాథ్ శిందేనే.. రాష్ట్ర సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా చక్కని పనితీరును కనబరుస్తారని చెప్పారు.

ఇవీ చదవండి : 'NCPకి అధ్యక్షుడిని నేనే.. 82 కాదు.. 92 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో సమర్థుడినే'

'సీఎం అవుతా.. బీజేపీలో 75 ఏళ్లకే రిటైర్మెంట్​.. శరద్​ మాత్రం 83 ఏళ్లు అయినా!'

Last Updated :Jul 7, 2023, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.