ETV Bharat / bharat

PFI బ్యాన్​.. భాజపా, మిత్రపక్షాలు హర్షం.. RSS నిషేధానికి విపక్షాల డిమాండ్

author img

By

Published : Sep 28, 2022, 6:03 PM IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదేళ్లు కేంద్రం నిషేధం విధించడంపై రాజకీయ పక్షాలు మిశ్రమ స్పందన వ్యక్తంచేశాయి. భాజపా, మిత్రపక్షాలు నిషేధాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్జేడీ, ఐయూఎమ్​ఎల్​ వంటి పార్టీలు ఆర్​ఎస్​ఎస్​ పైనా అదే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సీపీఎం, మజ్లిస్‌ మాత్రం నిషేధాన్ని వ్యతిరేకించాయి.

several-political-parties-reactions-on-five-years-pfi-ban
several-political-parties-reactions-on-five-years-pfi-ban

PFI Ban For Five Years : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్​ఐ, అనుబంధ సంస్థలపై నిషేధాన్ని భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు స్వాగతించాయి. దేశంలో ప్రజల మధ్య విద్వేష భావాలు ప్రేరేపిస్తున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివిధ రాష్ట్రాలకు చెందిన భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాలు దేశంలో మనుగడ సాధించలేవని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

పీఎఫ్​ఐపై నిషేధం విధించాలని వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా సుధీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోందని ఆయన చెప్పారు కర్ణాటక సీఎం. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సరైన నిర్ణయం తీసుకున్నారని బొమ్మై కితాబిచ్చారు. నూతన భారతావనిలో దేశభద్రతకు సవాల్ విసిరే తీవ్రవాదులు, నేరస్థులు, వ్యక్తులను అనుమతించే ప్రసక్తేలేదని.. ఉత్తర్​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. పీఎఫ్​ఐ జాతి వ్యతిరేక కార్యకలాపాలను ఖండించిన ఆయన నిషేధాన్ని స్వాగతించారు.

పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించాలని ఉత్తర్​ప్రదేశ్ మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి డానిష్ అజాద్ అన్సారీ సూచించారు. దేశంలో విధ్వంసం సృష్టించేవారు ఎవరైనాసరే.. ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు కట్టుబడి ఉంటుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్వ ట్వీట్ చేశారు. మోదీ యుగంలో ధైర్యమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పీఎఫ్​ఐ భారీ కుట్రపన్నినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అనుమానం వ్యక్తంచేశారు. భారత్‌లో దేశ భక్తులకు మాత్రమే చోటు ఉందని 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసేవారికి ఇక్కడ చోటులేదని శిందే వ్యాఖ్యానించారు.కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని ఆయన నాసిక్​లో అభిప్రాయపడ్డారు.

వారికి వ్యతిరేకం.. కానీ..
మతకలహాలను ప్రేరేపించే విధానాలు, సిద్ధాంతాలకు తమ పార్టీ వ్యతిరేకమని కాంగ్రెస్‌ స్పష్టంచేసింది. మెజార్టీ, మైనార్టీ అనే తేడా లేకుండా మతతత్వ విధానాలు ఏరూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టంచేశారు. పీఎఫ్​ఐ తరహాలోనే హిందువులను రెచ్చగొడుతున్న ఆర్​ఎస్​ఎస్​పైనా నిషేధం విధించాలని కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్‌ నేత రమేష్ చెన్నితాల డిమాండ్ చేశారు. ఆ రెండు సంస్థలకు పెద్ద తేడాలేదని..ఆయన అభిప్రాయపడ్డారు. పీఎఫ్​ఐ కార్యకపాలను ఖండిస్తున్నట్లు కేరళలో కాంగ్రెస్‌ మిత్రపక్షం ఐయూఎమ్​ఎల్ తెలిపింది. పీఎఫ్​ఐ సభ్యులు.. ఖురాన్‌ను సరిగా అర్థం చేసుకోలేదని ఐయూఎమ్​ఎల్​ నేత మునీర్ విమర్శించారు. ఆర్​ఎస్​ఎస్​పైనా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్​ఎస్​ఎస్​ సంగతేంటి?
ఆర్​ఎస్​ఎస్​ను హిందూ అతివాద సంస్థగా అభివర్ణించిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ దానిపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలను ఖండిస్తున్నట్లు తెలిపిన సీపీఎం దాని నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సమర్థించబోమని ప్రకటించింది. నిషేధం వల్ల పెద్ద ఉపయోగం ఉండబోదని మావోయిస్టు పార్టీ వంటి సంస్థలపై విధించిన ఆంక్షలు తెలియజేస్తున్నాయని సీపీఎం వివరించింది.

పీఎఫ్​ఐ, ఆర్​ఎస్​ఎస్​ కర్ణాటకలో పరస్పర హత్యలు, ప్రతీకార హత్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది సీపీఎం. ఇలాంటి సంస్థల నియంత్రణకు కచ్చితమైన సంకల్పం ఉండాలని పేర్కొంది. పీఎఫ్​ఐ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆ సంస్థపై నిషేధాన్ని సమర్థించబోమని స్పష్టంచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉపా చట్టాన్ని అడ్డుపెట్టుకుని.. పీఎఫ్​ఐ పాంప్లెట్‌ చేతిలో ఉన్న ప్రతి ముస్లిం యువకుడిని అరెస్ట్ చేసే అవకాశముందని ఒవైసీ వరుస ట్వీట్లలో ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.