ETV Bharat / bharat

"సిలంభం"లో దూసుకెళ్తున్న క్రీడాకారులు.. జాతీయ స్థాయిలో మెరుపులు

author img

By

Published : Apr 10, 2023, 2:05 PM IST

Silambam Training: ప్రాచీన కాలంలో మృగాల నుంచి రక్షించుకునేందుకు వినియోగించిన యుద్ధక్రీడ.. ఇప్పుడు శారీరక వ్యాయామంగానే కాకుండా మహిళల ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతోంది. ప్రాచీన యుద్ధ క్రీడల్లో విశిష్టత కలిగిన సిలంభంను విజయవాడ వాసులకు చేరువ చేస్తున్నాడు ఓ యువకుడు. అంతరించిపోతున్న క్రీడను అందరికీ నేర్పుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పిల్లలను, యువతను పంపుతున్న యువకుడిపై ప్రత్యేక కథనం .

Silambham Training
Silambham Training

"సిలంభం"లో శివంగుల్లా దూకుతున్న క్రీడాకారులు.. జాతీయ స్థాయిలో మెరుపులు

Silambam Training: కర్రసాము, కత్తిసాము మనం చాలా సినిమాల్లో చూస్తుంటాము. వాటిని గుర్తు చేస్తూ ఈ చిన్నారులు కర్రను అద్భుతంగా తిప్పుతున్నారు. అందరినీ ఆకర్షిస్తున్న ఈ క్రీడ పేరు సిలంభం. విజయవాడలో ఆ చిన్నారులతో పాటు యువతీ యువకులను ఈ క్రీడలో నిష్ణాతులను చేసిన వ్యక్తి పేరు సత్య శ్రీకాంత్‌. చిన్నపిల్లలతో ప్రారంభించి అందర్నీ సిలంభం క్రీడ వైపు తిప్పుకుంటున్నాడు.

సత్య శ్రీకాంత్ స్వస్థలం విశాఖపట్టణం. ఉద్యోగరీత్యా విజయవాడలో స్థిరపడ్డాడు. అప్పటికే యుద్ధ క్రీడ సిలంభంలో నైపుణ్యం సాధించిన శ్రీకాంత్‌ను.. ఈ విద్యను తమకూ నేర్పాలని పలువురు కోరడంతో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తరగతులు నిర్వహించుకునేందుకు శాప్ అధికారులు కూడా అనుమతినిచ్చారు. అంతరించిపోతున్న కళను అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఉదయం, సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియంలో క్లాసులు నిర్వహిస్తున్నాడు. తన వద్ద శిక్షణ తీసుకున్న వారి విజయాల గురించి శ్రీకాంత్‌ ఇలా చెబుతున్నాడు.

"మొదట నేను ఈ విద్యను ఇద్దరితో మొదలుపెట్టాను. ఆ తర్వాత 100 మంది పిల్లలను రెడీ చేశాను. ప్రస్తుతం 30 మంది ప్రతిరోజు రెండు పూటల వస్తారు. చాలా మంది పిల్లలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేను ఆడించాను. 2022లో మొదటి నేషనల్​ పోటీలు విశాఖలో జరిగాయి. ఐదు మంది పిల్లలు వెళ్తే అందులో ఒక పాప సిల్వర్​ మెడల్​ సాధించింది. రెండో నేషనల్​ పోటీలు కన్యాకుమారిలో జరిగింది. ఆరుగురు పిల్లలు వెళితే ఐదుగురికి మెడల్స్​ వచ్చాయి. మూడో సారి జరిగిన పోటీల్లో 14మంది పాల్గొంటే.. 13మంది పతకాలు సాధించారు"-సత్య శ్రీకాంత్ , సిలంభం శిక్షకుడు ​

సిలంభం విద్యను తాను నేర్చుకునే సమయంలోనే మరింత ప్రాచుర్యంలోకి తేవాలనుకున్నట్లు చెబుతున్నాడు శ్రీకాంత్‌. అయితే ప్రాచీన యుద్ధకళగా ఉన్న దీన్ని పలు రాష్ట్రాలు క్రీడగా గుర్తించి క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ క్రీడలో మొత్తం 13 రకాల స్టైల్స్‌ ఉంటాయని చెబుతున్నాడు శిక్షకుడు శ్రీకాంత్.

"ఈ పోటీలో 13రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్​ స్టిక్​. సింగిల్​ స్టిక్​లోనే రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెండు చేతులతో చేసేది. ఇంకోటి డెకరేటివ్​ స్టైల్​. ఇప్పుడు ప్రస్తుతం వాడేది డెకరేటివ్​ స్టైల్. మనకి ఒక్క నిమిషం సమయం ఇస్తారు. ఆ సమయంలోనే స్పీడ్​, వెరైటీస్​, స్టైల్​ ,సౌండ్​.. అలా మొత్తం 20పాయింట్లు ఉంటాయి. అందులో ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుస్తారో వారికి బహుమతి. ఈ ఆటకు తమిళనాడు, మహారాష్ట్ర స్పోర్ట్స్​ కోటా కింద 5%ఉంది. ఇక్కడ కూడా ప్రోత్సాహం అందిస్తే బాగుంటుంది"-సత్య శ్రీకాంత్ , సిలంభం శిక్షకుడు

శ్రీకాంత్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నవారు చిన్నపిల్లలతో పాటు యువత, ఉద్యోగస్థులు కూడా ఉన్నారు. సిలంభం నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాకుండా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వదలకుండా చివరి వరకు ప్రయత్నిస్తేనే గెలుపు సాధ్యమంటున్నారు సిలంభం క్రీడాకారులు.

"మేము ఇక్కడ ఒక సంవత్సరంన్నర నుంచి నేర్చుకుంటున్నాను. ఫస్ట్​ రాష్ట్ర స్థాయిలో ఆడాను. అందులో గోల్డ్​ వచ్చింది. తమిళనాడులోని రాజుపాలెంలో బ్రాంజ్​ మెడల్​ వచ్చింది. ఏదైనా జాతీయ స్థాయిలో పోటీలు ఉన్నాయంటే చాలా ఎక్కువ సేపు సాధన చేస్తాం. అలా చేయబట్టే మెడల్స్​ సాధించగలిగాం. మా కోచ్​ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాడు. ఆయన వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాము"-సిలంభం క్రీడాకారులు

ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే ఏం జరుగుతుందోనని భయపడే పరిస్థితులున్నాయి. అటువంటి సమయంలో పిల్లల ఆత్మరక్షణ కోసం సిలంభం అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. నేర్చుకునే సమయంలో దెబ్బలు తగిలినా.. క్రమంగా సాధన చేయటంతో నైపుణ్యం పెరుగుతుందని చెబుతున్నారు.

తమిళనాడులో విపరీతంగా పాపులర్‌ అయిన సిలంభం కళ క్రమక్రమంగా దేశవ్యాప్తం అవుతోంది. జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని విజయవాడ వాసులు సత్తా చాటుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పలు రాష్ట్రాల్లోలాగా క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించి, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.