ETV Bharat / bharat

రాహుల్​ గాంధీపై ఆ వీడియోలు.. టీవీ యాంకర్​ అరెస్టుపై రెండు రాష్ట్రాల వార్​!

author img

By

Published : Jul 5, 2022, 3:05 PM IST

Rahul Gandhis Doctored Video: న్యూస్​ యాంకర్​ రోహిత్​ రంజన్​పై ఛత్తీస్​గఢ్​లో కేసు నమోదైంది. రాహుల్​ గాంధీపై నకిలీ వీడియోల వ్యవహారంలో అతడిని అరెస్టు చేసేందుకు యూపీలోని గాజియాబాద్​ వెళ్లారు. దీనిని అడ్డుకున్న యూపీ పోలీసులు.. యాంకర్​ను తమతో తీసుకెళ్లారు. దీంతో హైడ్రామా నెలకొంది. ​

Rahul Gandhis doctored video
Rahul Gandhis doctored video

Rahul Gandhis Doctored Video: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించిన కేసులో ఓ న్యూస్‌ యాంకర్‌ 'అరెస్టు'.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియోల వ్యవహారంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న యాంకర్‌ రోహిత్‌ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు రాయ్‌పుర్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌ వెళ్లారు. అయితే ఈ అరెస్టును అడ్డుకున్న యూపీ పోలీసులు.. రంజన్‌ను తమతో పాటు తీసుకెళ్లడం గమనార్హం. అసలేం జరిగిందంటే..

కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్‌ గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. అయితే ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్యలాల్‌ హంతకులను ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ టీవీ ఛానల్‌ ప్రసారం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ టీవీ ఛానల్‌ యాజమాన్యం, యాంకర్‌ రోహిత్‌ రంజన్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు రాయ్‌పుర్‌లో కేసు పెట్టారు.

దీంతో రంజన్‌ను అరెస్టు చేసేందుకు ఈ ఉదయం రాయ్‌పుర్‌ పోలీసులు గాజియాబాద్ చేరుకున్నారు. రంజన్‌ నివాసానికి వెళ్లి అతడిని ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా.. గాజియాబాద్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. రాయ్‌పుర్‌ పోలీసులు అరెస్టు వారెంట్‌ చూపిస్తున్నప్పటికీ.. యూపీ పోలీసులు బలవంతంగా రంజన్‌ను తీసుకొని వెళ్లిపోయారు. దీంతో అతడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అతడు ఓ రహస్య ప్రాంతంలో యూపీ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు రాయ్‌పుర్‌ ఎస్పీ వెల్లడించారు.

అంతకుముందు.. ఈ అరెస్టు వ్యవహారంపై రంజన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ''స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నన్ను అరెస్టు చేసేందుకు మా ఇంటికి వచ్చారు. ఇది చట్టపరంగా సరైందేనా?'' అని ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్‌కు రాయ్‌పుర్‌ పోలీసులు బదులిచ్చారు. ''స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ఎలాంటి నిబంధనా లేదు. అయినప్పటికీ మేం సమాచారం ఇచ్చాం. మీపై ఉన్న అరెస్టు వారెంట్‌ను కూడా మీకు చూపించాం. మీరు దర్యాప్తునకు సహకరించాలి.'' అని రాయ్‌పుర్‌ పోలీసులు స్పష్టం చేశారు.

కాగా.. రాహుల్‌పై నకిలీ వీడియో వ్యవహారానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు భాజపా ఎంపీలపై కేసు నమోదైంది. రాహుల్‌ వీడియోను భాజపా నేతలు సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారానికి వినియోగించారని, తద్వారా దేశంలో మత విద్వేషాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ సహా ఎంపీలు సుబ్రత్‌ పాఠక్‌, భోలాసింగ్‌లపై ఛత్తీస్‌గడ్‌ సహా దిల్లీ, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కేసులు పెట్టింది.

ఇవీ చూడండి: నెహ్రూ మద్దతు లేకుండానే ప్రథమ రాష్ట్రపతిగా బాబూ!

'వివో కంపెనీ'పై ఈడీ దాడులు.. 44ప్రాంతాల్లో సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.