ETV Bharat / bharat

ఎన్నికల వేళ కలకలం.. సీఎం మేనల్లుడి ఇంట్లో రూ.8కోట్లు సీజ్​!

author img

By

Published : Jan 19, 2022, 1:45 PM IST

Punjab mining raids: ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో పంజాబ్​లో వేర్వేరు చోట్ల ఎన్​ఫోర్స్​మెంట్​ సోదాలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్​ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్​కు చెందిన ఇళ్లలోనూ ఈడీ దాడులు జరిపింది. ఆయన నివాసాల్లో రూ. 8 కోట్ల మేర నగదు స్వాధీనం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దాడులు కలకలం రేపుతున్నాయి.

Punjab mining raids:
Punjab mining raids:

Punjab mining raids: పంజాబ్​లో శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు నిర్వహించింది ఈడీ. మొత్తం రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పంజాబ్​ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ దగ్గరి బంధువు భూపిందర్​ సింగ్​ నివాసాల్లోనూ ఈడీ దాడులు నిర్వహించింది. ఆయన ఇళ్లలో రూ. 8 కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.

Punjab mining raids
చన్నీ సమీప బంధువు ఇంట్లో ఈడీ సోదాలు

సందీప్​ కుమార్​ అనే మరో వ్యక్తికి సంబంధించిన నివాసాల్లో రూ. 2 కోట్ల నగదు పట్టుబడింది. త్వరలో వీరికి సమన్లు జారీ చేసి ప్రశ్నించనుంది ఈడీ.

ED Raid On Punjab CM Nephew: అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా చలామణి చేస్తున్నారన్న ఆరోపణలతో.. రాష్ట్రంలో చండీగఢ్​, మొహాలీ, లుధియానా, పఠాన్​ కోట్​ సహా మొత్తం 12 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఎలక్ట్రానిక్​ పరికరాలు, కీలక దస్త్రాలను సీజ్​ చేసింది.

Punjab mining raids
భారీగా బయటపడ్డ ధనం

చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రాగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్ నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

కుట్రపూరితంగానే: చన్నీ

మరికొద్ది వారాల్లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భాజపా కుట్రపూరితంగానే దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ మంత్రులు, సభ్యుల మీద ఒత్తిడి పెంచడానికి కేంద్రం ఈడీని ఉసిగొల్పిందని సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ మండిపడ్డారు. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా మమతా బెనర్జీ సంబంధీకుల మీద ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. తనకు ఇసుక, అక్రమ ధన కేసులతో ఏ సంబంధమూ లేదనీ, ఈడీ ఒత్తిడికి తాను తలొగ్గబోనని చన్నీ స్పష్టం చేశారు.

"ఈసీ ఎన్నికల తేదీలు = భాజపా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు. పంజాబ్‌లో భాజపా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది" అంటూ ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ట్విట్టర్‌ వేదికగా భాజపాపై విమర్శలు గుప్పించారు.

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ ఇసుక తవ్వకాలు ప్రధానాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ మాజీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. ఇసుక మైనింగ్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం కెప్టెన్‌ మాట్లాడుతూ.. "ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ భాగస్వాములే. నేను పేర్లు చెప్పడం మొదలుపెడితే.. టాప్‌ (సీఎంను ఉద్దేశిస్తూ) నుంచి చెప్పుకుంటూ రావాలి" అని ఆరోపించారు.

అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో చన్నీపై పలు మార్లు విమర్శలు గుప్పించింది. సీఎం చన్నీ సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని గతేడాది డిసెంబరులో ఆప్‌ ఆరోపించింది.

పంజాబ్​లో ఫిబ్రవరి 20న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో మొత్తం 117 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: రైతులపై అఖిలేశ్‌ హామీల వర్షం- ప్రతి పంటకు ఎంఎస్​పీ.. ఇంకా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.