ETV Bharat / bharat

'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దర్జీ​ హత్య'.. భాజపా ఆరోపణ.. కాంగ్రెస్​ 'రాజ ధర్మం' కౌంటర్

author img

By

Published : Jun 29, 2022, 5:11 PM IST

ఉదయ్​పుర్​లో జరిగిన కన్హయ్య లాల్​ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యను ముక్తకఠంతో ఖండిస్తున్నారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తున్నారు. రాజస్థాన్​ సర్కారు కూడా ఈ ఘటనను సీరియస్​గా తీసుకుంది. అయితే విపక్షాలు మాత్రం.. కాంగ్రెస్​ సర్కారు నిర్లక్ష్యమే హత్యకు కారణమని విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. అదే స్థాయిలో కాంగ్రెస్​ కూడా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీకి సీఎం గహ్లోత్ పిలుపునిచ్చారు.

Political parties have openly condemned the Udaipur assassination
ఉదయ్​పుర్​ హత్య: గహ్లోత్​ టార్గెట్​.. కాంగ్రెస్​ ఎదురుదాడి

కన్హయ్య లాల్​ హత్య.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పార్టీలు, వర్గాలకు అతీతంగా జరిగిన దారుణాన్ని ఖండిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి విపక్షాలు. ముఖ్యంగా భాజపా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కన్హయ్య లాల్​ది కేవలం హత్య కాదని, ఇదొక ఉగ్రవాద చర్య అని భాజపా అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి రాజస్థాన్​లోని కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆ పార్టీ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలకు అవకాశం లభిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో పలు 'జిహాదీ' ఘటలు జరిగిన వారం వ్యవధిలోనే.. ఈ హత్య జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

"రాష్ట్రంలో మత దురభిమానంతో చేస్తున్న నేరాలకు ఇది కొనసాగింపు. కాంగ్రెస్​ నాయకులకు పదవులను కాపాడుకోవడానికే సమయం సరిపోతోంది. ప్రజలకు భద్రత కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి."

--రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, భాజపా అధికార ప్రతినిధి

తాలిబన్​ తరహా చర్య: కన్హయ్య లాల్ హత్యను తాలిబన్ల తరహా అనాగరిక చర్యగా అభివర్ణించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ. ఇలాంటి ఘటనలు ఇస్లాం, మానవత్వానికి అవరోధాల వంటివని అభిప్రాయపడ్డారు. ఈ తరహా దారుణాలను ఏ సమాజం, దేశం కూడా సహించదన్నారు నఖ్వీ.

" హేయమైన కుట్రల ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాంటి దుష్ట శక్తులను ఎదురించడానికి అందరం ఐక్యంగా పనిచేయాలి."

--ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మంత్రి

సమాజానికి ఒక హెచ్చరిక: రాజస్థాన్‌లో జరిగిన దర్జీ హత్యను కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్రంగా ఖండించారు. పెచ్చరిల్లుతున్న ఇలాంటి మతవాద తీవ్రవాదం సమాజానికి ఒక హెచ్చరిక అన్నారు. మతవాదానికి మరో మతవాదం సమాధానం కాదని.. లౌకికవాదమే అనే వాస్తవాన్ని గ్రహించి.. ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు విజయన్​. లౌకిక విలువలను విశ్వసించే మత సంఘాలు.. ఈ దారుణాన్ని ఖండించాలని కోరారు.

ఇలాంటి హత్యలు సమాజంలో నెలకొని ఉన్న మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్. ఉదయ్‌పుర్ హత్య హేయమైనది, భయంకరమైనదన్నారు. రాజస్థాన్​ ప్రభుత్వం అన్నిరకాలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అశోక్ గెహ్లోత్ కీలక వ్యాఖ్యలు: ఉదయపుర్‌ ఘటన నేపథ్యంలో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం అశోక్ గెహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హత్య చేసిన ఇద్దరిపై రాజస్థాన్ పోలీసులు 'ఉపా' చట్ట కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హంతకులకు విదేశాల్లో కూడా పరిచయాలు ఉన్నట్లు సమాచారం అందిందని వివరించారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారిస్తోందన్నారు. రాజస్థాన్ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్​) సైతం.. ఎన్​ఐఏకు పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

"ఉదయ్‌పుర్ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఉగ్రదాడిని వ్యాప్తి చేసేందుకు ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు తెలిపారు"

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ సీఎం

అఖిపక్షల సమావేశం: కన్హయ్య లాల్ హత్య కేసుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. సీఎం అశోక్ గెహ్లోత్​ చాలా సీరియస్​గా​ తీసుకున్నారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన.. అశోక్ గెహ్లోత్ సాయంత్రం అఖిపక్షల సమావేశానికి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ ఎదురుదాడి: దర్జీ హత్యకు కాంగ్రెస్​ సర్కారు బాధ్యత వహించాలని డిమాండ్​ చేస్తున్న భాజపాపై కాంగ్రెస్​ కూడా ఎదురుదాడికి దిగుతోంది. అశోక్ గహ్లోత్​ ప్రభుత్వానికి 'రాజ్ ధర్మం' గురించి తెలుసునని, హత్యకు కారకులైన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్​ పవన్​ ఖేరా స్పష్టం చేశారు. హత్య ఉదంతంపై ప్రభుత్వం సకాలంలో స్పందించిందన్నారు. హంతకులను ఆరు గంటల్లోనే అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. సాయంత్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీలో ఈ విషయంపై చర్చ జరుతుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. వెంకయ్య వారసుడు ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.