ETV Bharat / bharat

'ఓబీసీ జడ్జిల సంఖ్య 15శాతమే.. కొలీజియంతో సామాజిక న్యాయం జరగట్లేదు'

author img

By

Published : Jan 2, 2023, 6:29 AM IST

కొలీజియం నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో ఓబీసీలు కేవలం 15 శాతం మాత్రమే ఉన్నారని తెలిపింది.

collegium hc appointments
collegium hc appointments

కొలీజియం వ్యవస్థ వచ్చి మూడు దశాబ్దాలైనా, జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో ఓబీసీలు కేవలం 15 శాతం మాత్రమే ఉన్నారని తెలిపింది. "జడ్జీల నియామక బాధ్యతను కొలీజియం వ్యవస్థ స్వీకరించి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. సమ్మిళితంగా, అందరికీ ప్రాతినిధ్యం వహించేలా, సామాజిక వైవిధ్యత ఉండేలా ఉన్నత న్యాయవ్యవస్థను రూపొందించాలన్న ఆకాంక్ష నెరవేరలేదు" అని భాజపా సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ నేతృత్వంలోని సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో న్యాయశాఖ స్పష్టం చేసింది.

షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), మైనార్టీలు, మహిళల నుంచి అర్హులైన అభ్యర్థులను సిఫార్సు చేయాల్సిన బాధ్యత కొలీజయం వ్యవస్థదేనని న్యాయశాఖ తెలిపింది. 2018 నుంచి 2022 డిసెంబరు 19 వరకు హైకోర్టుల్లో 537 న్యాయమూర్తుల నియామకం జరిగిందని, ఇందులో ఎస్టీలు 1.3%, ఎస్సీలు 2.8%, ఓబీసీలు 11%, మైనార్టీల నుంచి 2.6% ఉన్నారని తన నివేదికలో పేర్కొంది.

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణితోపాటు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే విచారణను ముగించి తీర్పును రిజర్వు చేసింది. ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ జనవరి 4న పదవీ విరమణ చేయనుండగా.. రిజర్వు చేసిన తీర్పు రెండు రోజుల ముందు వెలువడనుండటం విశేషం. సుప్రీంకోర్టులో ఖరారైన సోమవారం నాటి జాబితా ప్రకారం ఈ అంశంపై రెండు వేర్వేరు తీర్పులు వెలువడనున్నాయి. ధర్మాసనం సభ్యులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న రెండో తీర్పు ఇస్తారు. ఈ రెండు తీర్పులు ఒకేలా ఉంటాయా?.. భిన్నంగా ఉండనున్నాయా? అన్నది చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.