హరిహరా... స్నేహితురాలి ఇంట్లో స్నానం.. ఆమెతో రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ!

author img

By

Published : Mar 6, 2023, 10:17 PM IST

Updated : Mar 6, 2023, 11:00 PM IST

Naveen murder case Updates in telangana state

Naveen Murder Case update: బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హరిహర కృష్ణ, నవీన్ శరీర అవయవాలను సంచిలో పెట్టుకొని తన స్నేహితుడు హసన్ సాయంతో మన్నెగూడలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసిన రెండు రోజుల తర్వాత తన స్నేహితురాలు ఘటనా స్థలానికి తీసుకెళ్లి నవీన్ మృతదేహాన్ని దూరం నుంచి చూపించి హరిహర కృష్ణ, ఆ తర్వాత ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు, స్నేహితులు నవీన్ ఆచూకీ గురించి ఇద్దరినీ ఆరా తీసినా ఏమాత్రం తెలియనట్లు నటించారు. పోలీసుల దర్యాప్తులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు తేలడంతో హసన్, నిహారికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Naveen Murder Case Updates: నవీన్ హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు హరిహర కృష్ణకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హరిహర కృష్ణ స్నేహితుడు హసన్‌తో పాటు, స్నేహితురాలని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. గత నెల 17వ తేదీన నవీన్‌ను హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్‌లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు శరీరం నుంచి వేరు చేసి వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు.

హసన్‌తో కలిసి హరిహర కృష్ణ, శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్ రెడ్డి నగర్‌లో ఉండే స్నేహితురాలి వద్దకు వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం తెలిపి.. ఖర్చుల కోసం 1500రూపాయలు తీసుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్‌లో యువతితో, హసన్‌తో సంప్రదింపులు జరిపాడు.

20వ తేదీ సాయంత్రం మరోసారి యువతి వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తిన్న తర్వాత నిహారికను హరిహరకృష్ణ ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. 21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి తమ కుమారుడి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడు.

ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లో తలదాచుకొని 23వ తేదీ వరంగల్‌లో తండ్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో... వెంటనే పోలీసులకు లొంగి పోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు. 24వ తేదీ హరిహర కృష్ణ హైదరాబాద్‌కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు. ఆధారాలు చెరిపివేసేందుకు నవీన్ మృతదేహాన్ని తగులబెట్టాలని హరిహర కృష్ణను హసన్ సూచించాడు. అంతేకాకుండా మన్నెగూడలో పడేసిన నవీన్ తల, ఇతర అవయవాలను సంచిలో తీసుకొచ్చిన హసన్ వాటిని హరిహరకు ఇచ్చాడు.

హరిహర ఆ సంచిని హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి తగులబెట్టాడు. ఆ తర్వాత బీఎన్ రెడ్డి నగర్‌లోని యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, లోపలికి వెళ్లి స్నానం చేశాడు. బీఎన్ రెడ్డి నగర్ నుంచి సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. నవీన్‌ను హరిహర కృష్ణ హత్య చేసిన విషయం హసన్‌కు, యువతికి తెలిసినా బయటపెట్టలేదు. పైగా నవీన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్ చేసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించారు.

నవీన్ స్నేహితుడు నిహారికకు ఫోన్ చేసి హరిహర కృష్ణ వివరాలు అడిగాడు. నవీన్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పినా.... అవునా, ఎక్కడికి వెళ్లాడు అంటూ మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది. హసన్ సైతం పోలీసులు పిలిచి ప్రశ్నించినప్పుడు హత్య గురించి తనకు తెలియదని... పోలీసుల ఎదుట లొంగిపొమ్మని చెప్పినట్లు తెలిపాడు. కానీ శరీర అవయవాలను మన్నెగూడలో పడేసిన విషయాన్ని దాచిపెట్టాడు. హరిహరను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న క్రమంలో హసన్, యువతిల పాత్ర బయటపడింది. పోలీసులు ప్రశ్నించిన సమయంలో హసన్, యువతిలో కనీసం ఎలాంటి భయం, బెరుకు లేకపోవడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు.

ఎలాంటి నేర చరిత్ర లేకున్నా... ఇంత ధైర్యంగా నిజాలు దాచిపెట్టడమేంటని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. బీటెక్ చదివే వయసులో ఇంత క్రూరంగా వ్యవహరించిన హరిహర కృష్ణ, అతనికి సహకరించిన హసన్, యువతి గురించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హరిహర కృష్ణ కస్టడీ కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీ వరకు హరిహరను పోలీసులు ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

హరిహరా... స్నేహితురాలి ఇంట్లో స్నానం.. ఆమెతో రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ!

ఇవీ చదవండి:

Last Updated :Mar 6, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.