ETV Bharat / bharat

'వాటి సంగతేంటి?'.. సోనియాకు 2 గంటల్లో ఈడీ 25 ప్రశ్నలు! కాంగ్రెస్​ పోరుబాట!!

author img

By

Published : Jul 21, 2022, 4:38 PM IST

Updated : Jul 21, 2022, 5:38 PM IST

National herald case sonia: నేషనల్​ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. రెండు గంటల్లోనే 25 ప్రశ్నలు సంధించింది. సోమవారం మళ్లీ రావాలని సమన్లు జారీ చేసింది. సోనియాను ఈడీ విచారణకు పిలవడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సోనియాకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి.

sonia gandhi
సోనియా గాంధీ

సోనియా గాంధీని విచారించిన ఈడీ

National herald case sonia: దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నేతల తీవ్ర నిరసనల మధ్య ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ తొలిరోజు విచారించింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియాకు సమన్లు జారీ చేసిన ఈడీ గురువారం 2 గంటల పాటు విచారణ జరిపి.. దాదాపు 25 ప్రశ్నలు అడిగింది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణించిన ఈడీ అధికారులు.. తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. మధ్యాహ్నం రెండున్నరకు ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

అంతకుముందు.. సోనియాకు తోడుగా ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్​ గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. రాహుల్ వెంటనే తిరిగి వెళ్లిపోగా.. సోనియాకు సహాయకారిగా ప్రియాంక అక్కడే ఉన్నారు. అయితే విచారణ గది కాకుండా.. మరో గదిలో ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతి ఇచ్చింది. మరోవైపు.. సోనియా విచారణ సమయంలో ఇద్దరు వైద్యులు, అంబులెన్స్​ను సిద్ధంగా ఉంచినట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా నిరసనలు..
సోనియా గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్​ ఎంపీలను నిర్బంధించారు. దాదాపు 75 మంది కాంగ్రెస్​ ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

విపక్షాల మద్దతు..
సోనియా గాంధీకి కాంగ్రెస్​ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. డీఎంకే, శివసేన, ఆర్​జేడీ, సీపీఐ, సీపీఎం సహా మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు సోనియాకు మద్దతు పలికారు. పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యి ప్రకటన విడుదల చేశారు. అధికార దుర్వినియోగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై కేంద్రం నిరంతరం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్షాల్లోని కీలక నేతలే లక్ష్యంగా కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు. "మరోసారి భాజపాకు చెందిన ఈడీ (ఎక్స్​టెండెడ్​ డిపార్ట్​మెంట్​) కేంద్రంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారిమళ్లించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎలాంటి ఆధారాలు లేకపోయినా తరచూ వారిని విచారణ పేరుతో కార్యాలయానికి పిలిపిస్తోంది" అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది అన్నారు.

ఇదీ కేసు..: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

ఇదీ చూడండి : యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి..

Last Updated :Jul 21, 2022, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.