బ్యాంక్ జాబ్ వద్దు.. బస్సు డ్రైవర్​ ఉద్యోగమే ముద్దు.. శీతల్​ రూటే సెపరేటు!

author img

By

Published : Jan 31, 2023, 6:26 PM IST

Etv Bharat
Etv Bharat ()

బ్యాంకులో ఉద్యోగం.. చక్కటి జీతం.. ఏసీ గదిలోనే పని.. అయినా ఆమె మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆర్​టీసీ బస్సు డ్రైవర్​గా మారారు. ఎవరామె? ఎందుకు ఇదంతా?

మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-ఆర్​టీసీలో మొదటిసారిగా ఓ మహిళ.. బస్సు డ్రైవర్​గా చేరనున్నారు. ఇందుకోసం ఏడాదిన్నరపాటు శిక్షణ తీసుకున్న ఆమె బ్యాంక్​ మేనేజర్​ ఉద్యోగాన్ని కాదని మరీ ఈ రంగంలోకి ప్రవేశించారు. ఆమెనే పుణెకు చెందిన శీతల్​ శిందే. ఈమెతో పాటు మరికొంత మంది మహిళలు కూడా బస్సు డ్రైవర్లుగా ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పుణె డివిజన్‌లో 17 మంది మహిళలు బస్సు డ్రైవర్లుగా శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్నారు. కొద్ది రోజుల్లో రెండో దశ శిక్షణను కూడా పూర్తి చేసుకుని మార్చి నెలాఖరులోగా విధుల్లో చేరనున్నారు. వీరిలో ఒకరైన శీతల్ శిందే.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆర్​టీసీలో చేరానని చెబుతున్నారు. ఇందుకోసం ఏకంగా బ్యాంక్​ మేనేజర్​ ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నానని తెలిపారు. డ్రైవర్​గా ఏడాదిన్నర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న శీతల్​ తుది పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. పుణెలో మొదటి మహిళా బస్సు డ్రైవర్​గా నిలవాలని ఆశిస్తున్నారు.

ఇదివరకు మహారాష్ట్ర ఆర్​టీసీలో పురుషులు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేసేవారు. 2019లో సంస్థ నియామక ప్రక్రియలో పలు మార్పులు చేసి మహిళలకు కూడా డ్రైవర్లుగా అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. దీంతో 2019 మార్చిలో మహిళా డ్రైవర్ల రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటికే అక్కడి మహిళలు కండక్టర్లుగా విధులు నిర్వహిస్తుండగా డ్రైవర్లుగా మారేందుకు మొగ్గు చూపారు. అదే సంవత్సరం మొదటిసారి మహిళల నుంచి బస్సు డ్రైవర్​ ఉద్యోగం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 194 మందిని ఎంపిక చేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలోనే మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మధ్యలో కరోనా కారణంగా ఈ తర్ఫీదుకు కాస్త బ్రేక్​ పడ్డా ఏడాదిన్నర క్రితం తిరిగి ప్రారంభమైంది. శిక్షణలో భాగంగా ఎంపిక చేసిన మహిళల్లో చివరకు 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలోనూ కొందరు వ్యక్తిగత కారణాల వల్ల వైదొలగగా.. ప్రస్తుతం 17 మంది మహిళలు క్రమం తప్పకుండా శిక్షణకు హాజరవుతున్నారు.

Shital Shinde Pune Women Bus Driver
బస్సు నడుపుతున్న శీతల్ శిందే

వీరిలో శీతల్​ శిందే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకుంటే 2014లో పుణెలోని యాక్సిస్​ బ్యాంక్​లో మేనేజర్​గా నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆమె డ్రైవర్ కావాలనే కోరికతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఆర్​టీసీ పుణె డివిజన్​లో చేరారు. ఎప్పుడూ ఫోర్​ వీలర్​ నడపని శీతల్​ ఎంతో కష్టపడి బస్సు డ్రైవింగ్​ నేర్చుకున్నారు. ఈ ఉద్యోగం సంపాదించటం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు శీతల్​.
ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా డ్రైవర్లకు 80 రోజుల తుది పరీక్ష పెట్టనుంది సంస్థ. ఈ 80 రోజుల పరీక్షలో వీరు 800 కిలోమీటర్లు మేర ఘాట్​రోడ్లు, హైవేలతో పాటు రాత్రి సమాయాల్లో డ్రైవింగ్​ చేయాల్సి ఉంటుంది.

Shital Shinde Pune Women Bus Driver
శీతల్​ శిందే, మహిళా బస్సు డ్రైవర్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.