ETV Bharat / bharat

'ఆ పులిని చంపొద్దు.. పట్టుకోండి చాలు'

author img

By

Published : Oct 5, 2021, 6:08 PM IST

నీలగిరి జిల్లాలోని మసినగుడి ప్రాంతంలో (Masinagudi Tiger) సంచరిస్తున్న పులిని అధికారులు చంపొద్దని మద్రాస్​ హైకోర్టు ఆదేశించింది. టీ23గా పేర్కొంటున్న ఈ పులి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

madras high court
పులి సంచారంపై మద్రాస్​ హైకోర్టు

తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడి (Masinagudi Tiger) ప్రాంతంలో ఇప్పటికే నలుగురిని చంపి స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న పులి సంచారంపై మద్రాస్​ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీ23గా పేర్కొంటున్న ఆ పులిని చంపొద్దని (T 23 Tiger News) అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇతర జంతువులకు ఇబ్బంది కలగకుండా పులిని పట్టుకోవాలని సూచించింది. పులిని పట్టుకోవడంపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సంగీత డోగ్రా అనే వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్త దాఖలు చేసిన పిటీషన్​పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

'అధికారులు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారు'

మసినగుడి ప్రాంతంలో (Masinagudi Tiger) పులి దాడులకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భయాందోళలకు గురైన స్థానికులు పులిని ఎలాగైన చంపాల్సిందేనంటూ డిమాండ్​ చేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర చీఫ్​ వైల్డ్​లైఫ్​ వార్డెన్ శేఖర్ కుమార్​ నీరజ్​.. పులిని చంపాలని ఈనెల 1న ఆదేశాలు జారీ చేస్తూ 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ చర్యను వ్యతిరేకించిన సంగీత డోగ్రా.. అక్టోబరు 2న మద్రాస్​ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పులి మనుషులను వేటాడే మృగమో కాదో శాస్త్రీయంగా రుజువు కాలేదని.. అధికారులు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇటీవల శేఖర్​ కుమార్​.. సంగీత డోగ్రా పిటిషన్​పై స్పందిస్తూ, తాము కేవలం పులిని బంధించేందుకు మాత్రమే చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

కారణం అదే..

10 రోజులుగా పులిని పట్టుకునేందుకు అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జులై నుంచి పులి దాడులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇతర పులులతో తలపడి తీవ్రంగా గాయపడ్డ ఆ పులి.. ఆహారం సులువుగా దొరకడం కోసం ఇలా మనుషులపై దాడులకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నారు. ఈ పులి వయసు 10-11 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి : ఉత్తరాల పంపిణీకి పోస్ట్​ఉమన్ ఎగనామం- ఇంట్లో సంచులకొద్దీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.