ETV Bharat / bharat

'ఉక్రెయిన్​కు భారత్​ సాయంపై బైడెన్ ప్రశంసలు'

author img

By

Published : Apr 11, 2022, 10:00 PM IST

Updated : Apr 12, 2022, 6:18 AM IST

Modi Biden Meeting: యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ మద్దతుగా నిలవడాన్ని ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఇరుదేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని మోదీ, జో బైడెన్ వర్చువల్​గా సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలించి, శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తంచేశారు.

modi biden
మోదీ

Modi Biden Virtual Meet: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తున్న భారత్‌, అమెరికాలు సోమవారం ఒకే వేదికపైకి వచ్చి.. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాయి. పోరుతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దాం అనే దానిపై మల్లగుల్లాలు పడ్డాయి. ఈ అంశంపై తమ తటస్థ వైఖరిని భారత్‌ పునరుద్ఘాటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య వర్చువల్‌గా కీలక భేటీ జరిగింది. ఇందులో ఉక్రెయిన్‌ యుద్ధంపైనే ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పోరు వ్యవహారంలో భారత్‌ స్పందించిన తీరుపైన, రష్యా నుంచి రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపైన అమెరికా అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

శాంతి నెలకొంటుంది: నరేంద్ర మోదీ
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలించి, శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని మోదీ ఈ భేటీలో వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో అభంశుభం తెలియని పౌరులను చంపేయడం చాలా ఆందోళనకరమన్నారు. ఆ దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు వెంటనే భారత్‌ స్పష్టంచేసిందని తెలిపారు. ఆ దారుణాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌లో పౌరుల భద్రతకు, వారికి నిరాటంకంగా మానవతా సాయాన్ని అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ వంతుగా ఉక్రెయిన్‌కు, చుట్టుపక్కల దేశాలకు ఔషధాలు, ఇతర సహాయ సామగ్రిని అందజేసినట్లు వివరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. "జెలెన్‌స్కీతో నేరుగా చర్చించాల్సిందిగా పుతిన్‌కు సూచించా" అని తెలిపారు. భారత్‌, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సహజసిద్ధ భాగస్వామ్యం ఉందన్నారు. "ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్‌-అమెరికా భాగస్వామ్యం పరిష్కార మార్గం చూపుతుందని గత ఏడాది సెప్టెంబర్‌లో నేను వాషింగ్టన్‌ వచ్చినప్పుడు మీరు అన్నారు. ఆ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా" అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో తాము చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆ దేశం నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి చేపట్టిన కసరత్తును ప్రస్తావించారు.
భారత్‌కు ఏ చర్యలూ సూచించలేదు: అమెరికా
బైడెన్‌ మాట్లాడుతూ.. భయానక దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ ప్రజలకు భారత్‌ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నామన్నారు. గతవారం అక్కడ ఒక రైల్వే స్టేషన్‌పై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించారని, అందులో చిన్నారులు, మహిళలు సహా పదుల సంఖ్యలో పౌరులు మరణించారని గుర్తుచేశారు. రష్యా యుద్ధంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే అంశంపై భారత్‌, అమెరికాలు పరస్పరం సంప్రదించుకుంటాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతోందని కూడా తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం భారత్‌కు ప్రయోజనకరం కాదని మోదీకి బైడెన్‌ సూచించినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది. మరిన్ని మార్గాల నుంచి ఇంధన దిగుమతులు సాగించేలా చేయూతనందిస్తామని పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​కు షాక్.. ఖర్గేను ప్రశ్నించిన ఈడీ.. 'అగస్టా కేసు'లో వారికి నోటీసులు

Last Updated :Apr 12, 2022, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.