ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల ఎన్నికల బరిలో కామ్రేడ్లు ఉన్నట్టా? లేనట్టా?

author img

By

Published : Jan 20, 2022, 5:12 PM IST

Left parties on Assembly elections : ఎక్కడ ఉద్యమాలు జరిగినా ముందుండే వామపక్షాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వార్తగా కూడా కనిపించడం లేదు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్​గా భావిస్తున్న ఈ అసెంబ్లీ పోరుపై కామ్రేడ్లు ఇంత వరకు పెదవి ఎందుకు విప్పలేదు? రైతుల పోరాటంలో క్రీయాశీలకంగా పని చేసిన ఎర్రజెండా పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తాయా? రైతు ఉద్యమం వామపక్షాలకు రాజకీయంగా ఉపకరిస్తుందా? కాషాయదళంపై సిద్ధాంత పరంగా ఒంటికాలిపై లేచే కామ్రేడ్ల పొత్తులు, ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి?

left-parties
ఐదు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్లు

Left parties on Assembly elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల్లీ నుంచి దిల్లీ స్థాయి వరకు అన్ని పక్షాలు.. తమ సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. పొత్తుల చర్చలు, సీట్ల కేటాయింపులతో బిజీబిజీగా గడుపుతూ.. ఆయా పార్టీల నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే దశాబ్దాల చరిత్ర, ఓటు బ్యాంకు కలిగి ఉన్న వామపక్షాల సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

వామపక్షాల్లో కీలకంగా చెప్పుకునే సీపీఐ, సీపీఎం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంత వరకు పెదవి విప్పలేదు. ఉత్తర్​ ప్రదేశ్​తో పాటు, పంజాబ్​లో తమ పార్టీల శాఖలు క్రీయాశీలకంగా పనిచేస్తున్నా.. ఈ ఎన్నికల బరిలో దిగుతామని కానీ, ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని కానీ.. ఇప్పటి వరకు ఆ పార్టీలు ప్రకటించలేదు. సీపీఐ, సీపీఎం తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వామపక్ష పార్టీ సీపీఐ-ఎంఎల్​ మాత్రం పంజాబ్​లో 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది.

అయితే పోటీ చేసే విషయంపై సీపీఐ, సీపీఎం నాయకత్వాలు చర్చలు జరుపుతున్నాయని, పంజాబ్‌లో 12 స్థానాల్లో తాము పోటీ చేయాలనుకుంటున్నట్లు ఇరు పక్షాలకు చెందిన నాయకులు చెబుతున్నారు.

"అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు రెండు పార్టీల రాష్ట్ర విభాగాలు చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక భాజపాను ఓడించగల శక్తికి మద్దతు ఇవ్వాలా? అనే దానిపై తుది నిర్ణయం దిల్లీ నాయకత్వం తీసుకుంటుంది" అని సీపీఎం సీనియర్​ నాయకుడు ఒకరు ఈటీవీ భారత్‌తో అన్నారు.

భాజపాను ఓడించే సామర్థ్యం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయకూడదని వామపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి చోట్ల భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు... ఇతర పార్టీలతో చేతులు కలుపుతామని నాయకులు చెబుతున్నారు.

cpm, cpi contest on assembly polls

2017లో అన్నింటా ఓటమే..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్​ పార్టీలు ఉత్తర్​ప్రదేశ్​లో 160 స్థానాలకు పైగా పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. పంజాబ్‌లో సీపీఐ, రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ కలిసి.. 36 స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ ఫలితం శూన్యం. ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల్లో కూడా కామ్రేడ్లకు రిక్తహస్తమే మిగిలింది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచినా, నిలవకపోయినా.. ఎలాంటి తేడా ఉండదనే అభిప్రాయానికి కామ్రేడ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పోటీ చేసే విషయంపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికలను ఫలితాలను గణపాఠం తీసుకొని.. ఈ సారి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు వామపక్ష నాయకులు చెబుతున్నారు.

ఎక్కువ సీట్లలో పోటీ చేసి.. భాజపాకు లాభం చేకూర్చే కంటే.. పొత్తు పెట్టుకొని తక్కువ స్థానాల్లో బరిలోకి దిగడం మేలని వామపక్ష నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇంతవరకు ఎవరినీ ఎన్నికల బరిలోకి కామ్రేడ్లు దింపలేదు.

భాజపాను ఓడించగలిగే శక్తికి మద్దతు?

ఇదిలా ఉంటే.. ఉత్తర్​ప్రదేశ్​లో విపక్షాలు 'ఎవరికి వారే యమునా తీరే' అన్న చందంగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో వామపక్షాలు ఒక్కటై కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. దీనిపై అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాగే భాజపాను ఓడించగలిగే శక్తికి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు.

వామపక్షాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బలమైన పునాది ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఆయా పార్టీల్లో ఎన్నికల్లో గెలవగలిగే ప్రజాకర్షణ శక్తి ఉన్న నాయకులు లేరు. ఏది ఏమైనా భాజపాను ఓడించడమే ప్రథమ అజెండాగా.. ముందుకెళ్లాలని కామ్రేడ్లు భావిస్తున్నారు.

పంజాబ్​, పశ్చిమ యూపీలో గుర్తింపు..

వాస్తవానికి సీపీఐ, సీపీఎంకు సంబంధించిన అఖిల భారత కిసాన్ సభకు పంజాబ్​తోపాటు పశ్చిమ ఉత్తర్​ ప్రదేశ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన రైతు ఉద్యమంలో ఈ రైతులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో తమ మైలేజ్ పెరుగుతుందని వామపక్షాలు అనుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో రైతుల ఉద్యమం కీలక అంశంగా మారిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు తమతో జట్టుకట్టేందుకు ఆసక్తిని కనపరుస్తాయని నాయకులు ఆశించారు. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్​, ఎస్పీ, ఆప్​, బీఎస్పీ కనీసం సంప్రదించలేదు.

రైతు ఉద్యమంలో తాము పోషించిన పాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉనికిని చాటుకోవాలని కామ్రేడ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐ సీనియర్ చర్చలు జరిపి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పాత్రపై రెండు లేదా మూడు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని సీనియర్​ నేత ఒకరు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.