జాబ్​ స్కామ్ కేసులో ED జోరు.. లాలూ కుమార్తెల ఇళ్లల్లో సోదాలు

author img

By

Published : Mar 10, 2023, 12:27 PM IST

Updated : Mar 10, 2023, 1:50 PM IST

land for job scam case

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసు దర్యాప్తులో జోరు పెంచింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). శుక్రవారం బిహార్​లోని లాలూ ప్రసాద్​ యాదవ్​ ముగ్గురు కుమార్తెల ఇళ్లతో పాటు.. ఆర్​జేడీ నాయకులు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది.

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో.. రైల్వేశాఖ మాజీ మంత్రి లాలుప్రసాద్‌ యాదవ్‌ బంధువుల ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ శుక్రవారం దాడులు చేపట్టింది. దిల్లీ, బిహార్‌లోని బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. దిల్లీలోని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తెలు మీసా భారతి, రాగిణి యాదవ్‌, చందా యాదవ్‌, హేమా యాదవ్‌ నివాసాలపై ఈ దాడులు జరిపింది. అదే సమయంలో ఆర్​జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే అబు దోజానా ఇంట్లోనూ ఈడీ సోదాలు చేసింది.

land for job scam case
బిహార్​ ఆర్​జేడీ ఎమ్మెల్యే అబు దోజానా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు

దిల్లీ, బిహార్‌లోని 15కు పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో అనుమానితుల నివాసాలు, కార్యాలయ ప్రాంగణాల్లో దాడులు చేసినట్లు వెల్లడించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధలన ప్రకారం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయమే ఐదుగురు అధికారులతో కూడిన బృదం.. దిల్లీలోని మీసా భారతి ఇంటికి చేరుకుంది. గత కొంత కాలంగా ఆయన తన కుమార్తె రాజ్యసభ ఎంపీ, మీసా భారతి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సీబీఐ చేపడుతున్న విచారణకు పూర్తి సహకారం అందిస్తామని లాలూ కుటుంబసభ్యులు తెలిపారు.

లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో కొందరికి భారతీయ రైల్వేలో ఉద్యోగాల ఇప్పించి.. వారి నుంచి లంచంగా భూమిని తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్‌ను సీబీఐ బృందం ప్రశ్నించిన కొద్ది రోజుల తర్వాత ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్‌ను సీబీఐ మంగళవారం రెండు సెషన్లలో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అంతకు ముందు ఆయన సతీమణి రబ్రీదేవిని కూడా సీబీఐ విచారించింది. లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 15న తమ ముందు హాజరుకావాలని లాలూ ప్రసాద్‌తో పాటు ఇతర నిందితులకు దిల్లీ కోర్టు గత నెలలో సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ ముగ్గురిని అరెస్ట్​ చేసింది.

కేసు ఏంటంటే?
2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో 'గ్రూప్​-డీ' ఉద్యోగాల కోసం లాలూ, అతని కుటుంబసభ్యులు కొందరి దగ్గర భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణతో సీబీఐ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. ఈ కేసులో లాలూ ప్రసాద్​.. పట్నా జోన్​కు చెందిన కొందరికి కోల్​కతా, ముంబయి, జైపుర్, జబల్​పుర్ వంటి జోన్లలో రైల్వే ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించింది. ఇందుకు బదులుగా ఉద్యోగాల పొందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు.. వారి భూములను లాలూ ప్రసాద్​కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది.

Last Updated :Mar 10, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.