ETV Bharat / bharat

'ద కశ్మీర్​ ఫైల్స్​' రిపీట్​.. హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు!

author img

By

Published : Jun 2, 2022, 4:19 PM IST

kashmir hindu killing: కశ్మీర్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఉగ్రవాదులు స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులను వరుసగా హత్య చేస్తూనే ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన ముష్కరులు.. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్‌ను బలితీసుకున్నారు. కశ్మీర్‌ లోయలో.. తమకు భద్రత కరవైందంటూ స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

kashmir-hindu-genocide
హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు

kashmir hindu killing: 'ద కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాను తలపించేలా కశ్మీర్‌లో హిందువులు, కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. లక్షిత దాడుల్లో భాగంగా.. నెల రోజుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని చంపిన ముష్కరులు.. ముగ్గురు హిందూ ప్రభుత్వ ఉద్యోగులను బలిగొన్నారు. రెండురోజుల క్రితం కశ్మీర్‌ ప్రాంతంలోని కుల్గామ్‌ జిల్లా గోపాల్‌పొరాలో రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిని బలితీసుకున్న ముష్కురులు.. గురువారం ఓ బ్యాంకు మేనేజర్‌ను పొట్టనబెట్టుకున్నారు.

రాజస్థాన్‌కు చెందిన విజయ్‌కుమార్‌ కుల్గామ్‌లోని ఇల్లాఖి దెహతి బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఆయన విధుల్లో చేరారు. ఉదయం బ్యాంకుకు రాగానే ఆయనపై.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఓ ముష్కరుడు బ్యాంకులోకి చొరబడి మరీ కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు బ్యాంకు పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టాయి.

గత నెల 31న కుల్గామ్‌ జిల్లా గోపాల్‌పొరాలో 36 ఏళ్ల రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిపై ఆమె పనిచేసే ప్రభుత్వ పాఠశాల వద్దే కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత నెల 12న బుద్గామ్‌ జిల్లా ఛదూరా తాలూకాలో రాహుల్‌ భట్‌ను ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయంలోనే కాల్చిచంపారు. మరోవైపు కశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మారణహోమం సృష్టించడంపై అక్కడి రాజకీయ పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వరుస దాడులను భాజపాతోపాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేతలు ఖండించారు. అమాయకులైన.. ప్రభుత్వ ఉద్యోగులను చంపడం దారుణమని మండిపడ్డారు.

పెద్దఎత్తున ఆందోళనలు: కశ్మీర్‌లో హిందువులపై వరుస ఉగ్రదాడులకు నిరసనగా కశ్మీరీ పండిట్‌లు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జమ్మూలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్‌ లోయలో తమకు రక్షణ కల్పించలేని పక్షంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ జమ్మూ ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు విధులకు హాజరు కాబోమని తేల్చిచెప్పారు.

జమ్మూకు చెందిన సుమారు 8వేల మంది కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతర జిల్లాల బదిలీలో భాగంగా కశ్మీర్‌లో పనిచేయాల్సి వస్తోందన్న ఉద్యోగులు, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయలేమని తేల్చిచెప్పారు. 15 ఏళ్లుగా కశ్మీర్‌లో పనిచేస్తున్నప్పటికీ తమకు భద్రత కరవైందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు రాలేదని విమర్శించారు. తమకు భద్రత లేకుండా పదోన్నతులు అవసరం లేదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:బ్యాంక్​ మేనేజర్​ను కాల్చి చంపిన ముష్కరులు

కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.