ETV Bharat / bharat

కొరియర్​ షాపులో మిక్సీ బ్లాస్ట్.. గర్ల్​ఫ్రెండ్​పై ప్రతీకారంతోనే!

author img

By

Published : Dec 27, 2022, 7:18 AM IST

Updated : Dec 27, 2022, 7:38 PM IST

మిక్సీ పేలిన ఘటన కర్ణాటకలోని హసన్​ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

karnataka blast case
karnataka blast case

కర్ణాటకలో మరో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. హసన్​ జిల్లాలో ఓ కొరియర్ షాపులో ఉన్న మిక్సీ పేలి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మిక్సీని మరో చోటుకు రవాణా చేస్తుండగా పేలడం వల్ల తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రెండు రోజుల క్రితం డీటీడీసీ కొరియర్‌కు వచ్చిన పార్శిల్‌ను నగరంలోని ఓ వ్యక్తికి డెలివరీ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తి ఈ కొరియర్​ తనది కాదని తిరిగి డీటీడీసీ వారికి అందించాడు. ఆ తర్వాత కొరియర్​ ఆఫీస్​లో ఆ మిక్సీ పేలింది. దీంతో యుజమాని శశి కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయంలోని వస్తువులు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హరిరామ్​ శంకర్​.. గాయపడిని వ్యక్తికి పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలిపారు.

అయితే, ఈ ఘటన వెనక ఉగ్ర కోణం లేదని ఎస్పీ హరిరామ్ శంకర్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమని తెలిపారు. 'పార్సిల్ తీసుకోవాల్సిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్ చేశారు. ఉగ్రవాదులు ఉపయోగించే పేలుడు పదార్థాలు, సాంకేతికత ఇక్కడ దొరకలేదు. ఎలక్ట్రానిక్ సర్క్యూట్​ల వల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదు. మైసూర్ నుంచి ఫోరెన్సిక్ టీమ్ వచ్చి నమూనాలు పరిశీలించింది. కొరియర్​ను తిరిగిచ్చిన వ్యక్తిని, పార్సిల్ పంపిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలు వదంతులను నమ్మొద్దు' అని ఎస్పీ వివరించారు. మాజీ గర్ల్​ఫ్రెండ్​పై ప్రతీకారం తీర్చుకోవడానికే ఓ వ్యక్తి బెంగళూరు నుంచి మిక్సీని పంపించాడని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.

ఇటీవలే మంగళూరు పోలీస్ స్టేషన్ సమీపంలో వెళ్తున్న ఆటోలో ఉన్న ప్రెజర్​ కుక్కర్​ ఒక్కసారిగా పేలింది. పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడితోపాటు ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ఆటోలో పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కుక్కర్​ పేలుడు ఓ ఉగ్రదాడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిక్సీ పేలుడుపైనా అలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి.

Last Updated : Dec 27, 2022, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.