కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివ కుమార్ తీవ్ర భావోద్వేగం.. ప్రజలకు థ్యాంక్స్​ చెబుతూ..

author img

By

Published : May 13, 2023, 1:49 PM IST

Updated : May 14, 2023, 3:58 PM IST

pcc President DK Shivakumar emotiona

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్​కు మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు.

కర్ణాటక పీసీసీ చీఫ్​ డీకే శివ కుమార్ తీవ్ర భావోద్వేగం.. ప్రజలకు థ్యాంక్స్​ చెబుతూ..

DK Shivakumar Emotional : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటడంపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతిచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నేతలకే చెందుతుందన్నారు. తనపై సోనియా చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని శివకుమార్‌ తెలిపారు.

"ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. రాష్ట్రస్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు నేతలు శ్రమించారు. సమష్టి కృషితో ఎన్నికల్లో గెలిచాం. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. ఈ విజయం పార్టీ శ్రేణులు, నాయకులది. వారు ఎంతో శ్రమించారు. ప్రజలు మాపై విశ్వాసం చూపారు. నాయకులు మాకు మద్దతు ఇచ్చారు. ఇది సమష్టి నాయకత్వం. మేమంతా కలిసి పనిచేశాం. నేను ఆరంభంలో చెప్పాను. మేమంతా కలవటం ఇది ఆరంభమని ఓటువేసిన రోజు చెప్పాను. కలిసి ఆలోచించటమే పురోగతి. కలసి పనిచేయటం విజయమని చెప్పాను. జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవటానికి సోనియా వచ్చిన విషయం నేను మరిచిపోలేను. బీజేపీ నేతలంతా కలిసి నన్ను జైల్లో పెట్టారు" అని డీకే శివకమార్​ వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్‌ కనకపురా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

ఆదివారమే సీఎల్​పీ మీటింగ్​.. సీఎం అభ్యర్థి ఎన్నిక!
ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఆదివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రేసులో ముందున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బెంగళూరుకు శనివారం సాయంత్రానికే చేరుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారు. అధిష్ఠానం పరిశీలకులను పంపిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై తదుపరి అడుగులు పడతాయని తెలిపారు.

రాహుల్‌ గాంధీ పాదయాత్ర వల్లే విజయం!: సిద్ధరామయ్య
డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్‌కు చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. రాహుల్‌ పాదయాత్ర పార్టీకి ఉపకరించింది. బీజేపీ నేతలు ఎన్నికల్లో చాలా ఖర్చు చేశారు. 2018లోనూ ఆపరేషన్‌ కమలం జరిగింది. డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు ఉపేక్షించరు. ఏ పార్టీ.. దేశాన్ని రక్షిస్తుందో ప్రజలకు తెలుసు" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది సెక్యులర్ పార్టీ విజయమని సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. 40 శాతం కమీషన్‌పై.. నిజాయతీ గెలిచిందన్నారు. పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ అర్థ, అంగబలానికి ఎదురొడ్డి నిలిచారు: చిదంబరం
"నిర్ణయాత్మక తీర్పు వెలువరించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు" అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ట్వీట్‌ చేశారు. "ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ. ఆధిపత్య సిద్ధాంతాలు, పక్షపాత ధోరణి వల్ల వాటిల్లే నష్టాలను అరికట్టే ప్రయత్నం ఇది" అని పేర్కొన్నారు. బీజేపీ అర్థ, అంగబలానికి కర్ణాటక ప్రజలు ఎదురొడ్డి నిలిచారన్నారు.

ఇది ప్రజా విజయం: ఖర్గే
కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు.. ప్రజా విజయమేనని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తమ నేతలంతా ఐక్యంగా పనిచేశారని, హామీలకే ప్రజలు పట్టం కట్టారని ఖర్గే అన్నారు.

"మొదట హిమాచల్‌ప్రదేశ్‌లో గెలిచాం. ఇప్పుడు కర్ణాటకలో విజయం సాధించాం. హిమాలయాల నుంచి సముద్రం వరకు కాంగ్రెస్‌ విజయం సాధించాం. దక్షిణ భారత్‌లో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అనే భాజపాయే ముక్త్‌ అయింది. కర్ణాటకలో ఓటమి ఖాయమని భాజపా అంచనాకు వచ్చింది. అందుకే మోదీ స్థానంలో అన్నీ టీవీల్లో నడ్డా ఫొటో పెట్టారు. మరొకమాట ఏమంటే భాజపా శ్రేణులు మోదీ బదులు యోగి యోగి అంటున్నాయి"

--భూపేశ్‌ బఘేల్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం

బీజేపీ ఓటమికి నాదే బాధ్యత: బొమ్మై
కర్ణాటక ప్రజల ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పార్టీ కార్యకర్తల వరకు అంతా శ్రమించినా కూడా సానుకూల ఫలితాలు రాలేదన్నారు. మొత్తం ఫలితాలను విశ్లేషించి లోపాలను సరిదిద్దుకొని 2024 పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కానున్నట్లు బొమ్మై చెప్పారు. "ప్రధాని నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరం తీవ్రంగా శ్రమించినా కూడా మేం మెజార్టీ సాధించలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం ఫలితాలు వచ్చాక విశ్లేషణ చేసుకుంటాం. ఎక్కడా లోపాలు ఉన్నాయో చూస్తాం. వివిధ స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం" అని బొమ్మై వ్యాఖ్యానించారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు బొమ్మై ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని తెలిపారు. వాటన్నింటిని తెలుసుకుని.. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరోసారి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

Last Updated :May 14, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.