ETV Bharat / bharat

సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకం

author img

By

Published : Oct 17, 2022, 7:03 PM IST

Updated : Oct 17, 2022, 7:25 PM IST

cji of india 2022
cji of india 2022

19:00 October 17

సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకం

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ 74 రోజుల స్వల్ప కాలం పాటు పదవి బాధ్యతలు నిర్వహించనున్నారు. నవంబర్‌8న జస్టిస్‌ లలిత్‌ పదవీ విరమణ చేయనుండగా నవంబర్‌9న జస్టిస్‌ చంద్రచూడ్‌ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

కీలక తీర్పుల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల కాలంలో పలు కీలక తీర్పుల్లో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ భాగస్వామిగా ఉన్నారు. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పురాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్‌ సెక్స్‌ ఇంటర్‌కోర్స్‌ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్‌ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మేజర్‌ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో స్పష్టంచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు
1959 నవంబరు 11న బొంబాయిలో జన్మించిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2000 మార్చి 29న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యేంతవరకూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్‌ లా స్కూల్‌లో ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ, జ్యుడిషియల్‌ సైన్సెస్‌లో డాక్టరేట్‌ పొందారు. దిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బి.ఎ., దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. ఇదివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ కుమారుడు జస్టిస్‌ ఎ.కె.సిక్రీ, జస్టిస్‌ కె.కె.మాథ్యూ కుమారుడు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు. తండ్రీకుమారులు ఇద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన ఘనత మాత్రం జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లకే దక్కనుంది.

ఆనవాయితీ ప్రకారం..
తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని అక్టోబర్​7న సీజేఐకి లేఖ రాశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ఈ క్రమంలోనే ఆయన లేఖకు ప్రతిలేఖ పంపించారు జస్టిస్​ లలిత్​. సుప్రీం కోర్టు సంప్రదాయాల ప్రకారం ఈ లేఖను తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టే వారికి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అందజేస్తారు. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.

Last Updated :Oct 17, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.