ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మన రక్షణశాఖే.. ఉద్యోగులు ఎంతమందో తెలుసా?

author img

By

Published : Oct 29, 2022, 3:29 PM IST

ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా భారత రక్షణశాఖ నిలిచింది. సైనికులు, సైనికేతరులు కలిపి 29లక్షల 20 వేల మంది సిబ్బందితో భారత రక్షణ శాఖ ప్రపంచంలోనే అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉందని జర్మనీకి చెందిన స్టాటిస్టా వెల్లడించింది. రెండో స్థానంలో అమెరికా రక్షణశాఖ నిలిచినట్లు ప్రకటించింది.

worlds biggest employeer statista report
defense ministry

త్రివిధ దళాలతో నలుమూలలా దేశాన్ని పరిరక్షిస్తున్న భారత రక్షణశాఖ తన బాధ్యతల నిర్వహణలో అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగాలను కల్పించిన వ్యవస్థగా భారత రక్షణశాఖ నిలిచింది.కార్యక్షేత్రంలో చురుగ్గా పనిచేసే సైనికులు,రిజర్వు సైనిక బలగాలు, సైనికేతర పౌర సిబ్బంది కలిపి 29లక్షల 20 వేల మంది భారత రక్షణశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధికమంది ఉద్యోగులకు రక్షణశాఖ యజమానిగా ఉందని జర్మనీకి చెందిన ప్రైవేటు సంస్థ స్టాటిస్టా ఒక నివేదికలో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు అంశాలపై డేటా,గణంకాలను స్టాటిస్టా సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఉద్యోగాల కల్పనపై స్టాటిస్టా విడుదల చేసిన నివేదికలో 29 లక్షల 10 వేల మంది సిబ్బందితో అమెరికా రక్షణశాఖ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. సైనికేతర పౌరసిబ్బందిని సైన్యంలో భాగంగా చూపకపోవడం వల్ల చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఉద్యోగుల సంఖ్య 25లక్షలుగా ఉందని స్టాటిస్టా సంస్థ నివేదికలో పేర్కొంది. చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్‌ కింద 68 లక్షల మంది పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ విశ్వసనీయమైన వివరాలు లేవని ఆ నివేదిక పేర్కొంది.

కంపెనీల పరంగా వాల్‌మార్ట్‌ను మించి ఉద్యోగాలు కల్పించిన సంస్థ మరొకటేదీ ప్రపంచంలోలేదని స్టాటిస్టికా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్‌లో 23లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని ఆ నివేదిక వివరించింది. అమెజాన్‌లో పనిచేసేవారి సంఖ్య 16లక్షలుగా ఉందని తెలిపింది. ప్రపంచ దేశాల సైనిక వ్యయం 2021లో 2 వేల 113 బిలియన్ డాలర్లకు చేరుకున్నందున స్టాటిస్టా తాజా నివేదిక పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని నిపుణులు చెబుతున్నారు. స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్-సిప్రీ ప్రకారం 2021లోఅత్యధిక సైనిక వ్యయం చేసిన తొలి 5 దేశాల్లో అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యా ఉన్నాయి.

ప్రపంచదేశాల మొత్తం సైనిక ఖర్చులో ఈ ఐదు దేశాల సైనిక వ్యయం 62శాతంగా ఉందని సిప్రీ వెల్లడించింది. 2021లో అమెరికా సైనిక వ్యయం 810 బిలియన్‌ డాలర్లుగా కాగా రెండో స్థానంలో ఉన్న చైనా 293 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. సైనిక దళాల కోసం భారత్ చేసిన ఖర్చు 76.6 బిలియన్ డాలర్లుగా ఉందని ఆ సంస్థ వివరించింది.

ఇదీ చదవండి: స్కూల్​కు బంక్ కొట్టి ఆత్మహత్య.. పార్క్​లో విషం తాగిన బాలికలు.. ఏమైందంటే?

పిల్లి విషయంలో గొడవ.. కుమారుడిని చంపిన తండ్రి.. యువకుడిని మింగేసిన మొసలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.