ETV Bharat / bharat

కమలాన్ని కలవరపెడుతున్న యాపిల్​ పండ్లు.. తలుచుకుంటే ప్రభుత్వాలని కూల్చేస్తాయ్​!

author img

By

Published : Nov 7, 2022, 7:40 AM IST

Himachal Pradesh Election : అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న భాజపాకు యాపిల్​ పండ్లు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ యాపిల్​ పండ్ల వల్ల గతంలో ప్రభుత్వాలు మారిన సందర్భాలున్నాయి. ఇప్పుడే ఇదే విషయం హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల్లో కమలాన్ని కలవరపెడుతోంది.

himachal pradesh election
himachal pradesh election

Himachal Pradesh Election : హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి తీవ్రంగా శ్రమిస్తున్న భారతీయ జనతాపార్టీకి యాపిల్‌ పండ్లు అనుకోని బెడదలా తయారయ్యాయి. యాపిల్‌ పంటకు పెట్టింది పేరైన రాష్ట్రంలో ఈ పండ్ల వ్యాపారం ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. యాపిల్‌ వ్యాపారంలోని కష్టనష్టాలు ఈసారి ఎన్నికల్లో అధికార భాజపాకు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

25 సీట్లలో..
భారత్‌లో యాపిల్‌ పంటకు స్వర్గధామంలా భావించే హిమాచల్‌లో ఏటా 5వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థికంలో ఈ రంగం వాటా 13.5%. 68 సీట్ల అసెంబ్లీలో 20-25 సీట్లను యాపిల్‌ వ్యాపారం ప్రభావితం చేస్తుంది.

నాడు భాజపాకు షాక్‌
ఎర్రగా బుర్రగా అందంగా ఉండే యాపిల్‌ పండుకు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను మార్చిన చరిత్ర ఉంది. 1990లో శాంతకుమార్‌ సారథ్యంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించిన ఘనత యాపిల్‌ వ్యాపారుల ఆందోళనదే. కనీస మద్దతు ధర కావాలంటూ ఆనాడు నినదించిన యాపిల్‌ వ్యాపారులపై భాజపా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంజేసింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారు. ఫలితంగా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో 60 సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలో పడిపోయాయి. అధికారంలోకి రాగానే ఆనాటి ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ యాపిల్‌ రైతుల డిమాండ్లకు పచ్చజెండా ఊపారు. మళ్లీ అప్పటి నుంచి ఈ వర్గం పెద్దగా ఆందోళనలు చేసింది లేదు.

30 ఏళ్ల తర్వాత మళ్లీ..
30 ఏళ్ల తర్వాత ఈసారి మళ్లీ యాపిల్‌ రైతులు, వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. పెరిగిన జీఎస్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ మద్దతును కోరుతూ రైతులు రోడ్లమీదికి వస్తున్నారు. పంటకు వాడే పురుగుమందులు, ప్యాకేజీ అట్టపెట్టలపై జీఎస్టీని 18శాతానికి పెంచారు. గతంలో వీటిపై పన్ను ఉండేది కాదు. అసలే సాగువ్యయం పెరిగి ఇబ్బంది పడుతుంటే ఈ పన్నుతో తమకేమీ గిట్టుబాటు కావటం లేదన్నది రైతుల ఆందోళన. పెద్దపెద్ద కంపెనీలు రంగంలోకి దిగి మార్కెటింగ్‌పై గుత్తాధిపత్యం చెలాయిస్తుండటం, వాటికి రాజకీయ పార్టీలు దన్నుగా నిలుస్తుండటం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. వీటికితోడు ఎంఐఎస్‌ (మండి) పథకం కింద ప్రభుత్వం నుంచి సొమ్ము చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

.

కాంగ్రెస్‌, ఆప్‌ ఆశ..
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. "యాపిల్‌ సమస్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. పెరిగిన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది" అని ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ హామీ ఇస్తున్నారు. కానీ వీటిని కంటితుడుపు చర్యగా ప్రతిపక్ష పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. 'జీఎస్టీ పరిహారాన్ని ప్రభుత్వం నుంచి తీసుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది. నిరక్షరాస్యులైన రైతులకు అది చేతకాదు' అని అవి ఎదురుదాడి చేస్తున్నాయి. 1990లో రైతులపై కాల్పులు జరిపిన తేదీని అమరవీరుల దినంగా నిర్వహించనున్నట్లు ఆప్‌ ప్రకటించింది. మొత్తానికి.. యాపిల్‌ రైతుల ఈ ఆగ్రహాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీన్నుంచి భాజపా ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

ఇవీ చదవండి : ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు

ఉపఎన్నికల్లో సత్తా చాటిన భాజపా.. పట్టు నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.