ETV Bharat / bharat

జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక నిర్ణయం

author img

By

Published : Sep 12, 2022, 2:30 PM IST

Updated : Sep 12, 2022, 6:12 PM IST

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై విచారణకు అంగీకరించింది.

Gyanvapi case
Gyanvapi case

దేశంలో చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా న్యాయస్థానం కీలక ఆదేశాలు వెలువరించింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది. వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన హిందూ వర్గాల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్.. కోర్టు నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించాలని కోరతామని చెప్పారు. శివలింగానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హిందువులకు ఈ రోజు ఎంతో సంతోషకరమైన రోజని మరో న్యాయవాది సోహన్ లాల్ ఆర్య అన్నారు. కాశీ ప్రజలు హిందూ సమాజాన్ని మేల్కొలిపేందుకు పనిచేస్తూనే ఉంటారని చెప్పారు.

పటిష్ఠ భద్రత
కోర్టు నిర్ణయం నేపథ్యంలో వారణాసిలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. కీలక ప్రాంతాల్లో గస్తీ వాహనాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని వారణాసి కమిషనర్ ఏ సతీశ్ గణేశ్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు. పట్టణంలో 2వేల మంది పోలీసు బలగాలను భద్రత కోసం నియమించినట్లు వారణాసి ఏసీపీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇదీ కేసు
జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్​కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

Last Updated :Sep 12, 2022, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.