కేంద్రం కొత్త రూల్స్​- 24 వారాల తర్వాత కూడా అబార్షన్​కు ఓకే!

author img

By

Published : Oct 14, 2021, 7:01 AM IST

abortion

కొన్నివర్గాల మహిళలకు గర్భాన్ని తొలగించే గరిష్ఠ పరిమితి గడువును 20 నుంచి 24 వారాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అబార్షన్‌ సవరణ చట్టం 2021 ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు అబార్షన్‌కు అర్హులని పేర్కొంది.

అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు 24 వారాల తర్వాత కూడా గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య మండలి ప్రత్యేక అనుమతితో ఇద్దరు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అబార్షన్‌ చేయించుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గర్భస్రావానికి ఇదివరకు ఉన్న 20 వారాల గడువును పెంచింది. లైంగిక దాడికి గురైనవారు, అత్యాచార బాధితులు, రక్త సంబంధంగల (ఇన్‌సెస్ట్‌)వారితో గర్భం దాల్చినవారు, మైనర్లు, గర్భం దాల్చిన సమయంలో వితంతువులైనవారు/ విడాకులు తీసుకున్నవారు, దివ్యాంగులు, మతి స్థిమితం లేనివారు, గర్భం కారణంగా తల్లి ప్రాణాలకు ముప్పు అని తేలినవారు, ఒకవేళ కాన్పు జరిగినా బిడ్డ తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందిపడే అవకాశం ఉందని తేలినప్పుడు గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది. వైద్యపరమైన కారణాలతో చేసే అబార్షన్ల కోసం తాజా నిబంధనలు రూపొందించింది.

24 వారాలు దాటితే..

24 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవాలంటే రాష్ట్రాలు ఏర్పాటు చేసే వైద్య మండలి అనుమతి తీసుకోవాలి. అలాంటి గర్భస్రావం వల్ల ప్రాణాలకు ముప్పులేదని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి లభిస్తుంది. నివేదికలను పరిశీలించి గర్భస్రావానికి అనుమతించాలా? లేదా? అనే నిర్ణయాన్ని మూడు రోజుల్లోపే వెలువరించాలి. 9 వారాల నుంచి 20 వారాల్లోపు అబార్షన్‌కు ఒక రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ అనుమతిస్తే సరిపోతుంది. 20 నుంచి 24 వారాల మధ్యనైతే ఇద్దరి అభిప్రాయం అవసరం.

ఇదీ చూడండి: ఆన్​​లైన్ గేమ్​ ఆడుతూ లవ్- రాష్ట్రాలు దాటొచ్చి పెళ్లాడినా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.