పెళ్లిలో ఫుడ్ పాయిజన్.. రస్​మలాయ్ తిన్న 60 మందికి వాంతులు

author img

By

Published : Mar 6, 2023, 9:29 AM IST

gorakhpur-food-poisoning
gorakhpur-food-poisoning ()

వివాహ వేడుకలో పెట్టిన ఆహారం తిని 60 మందికి పైగా అతిథులు అస్వస్థతకు గురయ్యారు. రస్​మలాయ్ స్వీట్ తిన్న తర్వాత వీరంతా వాంతులు చేసుకున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో పెళ్లింట ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ వివాహ వేడుకలో ఆహారం తిని అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత మరొకరు వాంతులు చేసుకున్నారు. పరిస్థితి తీవ్రంగా మారేసరికి వారందరినీ స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే..
గోరఖ్​పుర్​లోని పిప్రైచ్ ప్రాంతంలో ఉన్న గోదావరి మ్యారేజ్ హాల్​లో ఈ వివాహ వేడుక జరిగింది. అతిథులకు భోజనంలో భాగంగా రస్​మలాయ్ స్వీట్లను వడ్డించారు. వాటిని తిన్న తర్వాతే అనేక మంది వాంతులు చేసుకున్నారు. మొత్తంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. తొలుత పిప్రైచ్​లోని పీహెచ్​సీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారిని జిల్లా వైద్య కళాశాలకు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

gorakhpur-food-poisoning
ఆస్పత్రిలో పేషెంట్లు

ఫుడ్ పాయిజన్ గురించి సమాచారం అందగానే 12 అంబులెన్సులను మ్యారేజ్ హాల్​కు పంపినట్లు అధికారులు తెలిపారు. సీఎంఓలో వైద్యుడిగా పనిచేస్తున్న అశుతోశ్ కుమార్ దుబె సైతం రోగులు చేరిన ఆస్పత్రిలోనే ఉన్నారని అధికారులు చెప్పారు. రోగులందరికీ మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి నందకుమార్ వెల్లడించారు. ఇప్పటివరకైతే ఎవరూ ఈ ఘటనలో చనిపోలేదని స్పష్టం చేశారు. ఎవరికీ ప్రాణాపాయం కూడా లేదని అన్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోందని అన్నారు. బాధితుల కోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు సీఎంఓ వైద్యుడు అశుతోశ్ కుమార్ దుబె వెల్లడించారు. సమాచారం అందగానే అంబులెన్సులను పంపినట్లు చెప్పారు. వైద్యుల బృందాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. రాత్రికి రాత్రే చికిత్స అందించి కొంతమందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డ ఆరుగురిని బీఆర్​డీ మెడికల్ కాలేజీలో చేర్చారని చెప్పారు.

gorakhpur-food-poisoning
ఆస్పత్రిలో పేషెంట్లు
gorakhpur-food-poisoning
ఆస్పత్రిలో పేషెంట్లు

వివాహ వేడుకలో చికెన్, చేపలు సైతం వడ్డించినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్​కు కారణమని భావిస్తున్న రస్​మలాయ్​తో పాటు అన్ని ఆహార పదార్థాల నమూనాలను సేకరించినట్లు జిల్లా ఏడీఎం పురుషోత్తమ్ దాస్ గుప్తా తెలిపారు. వాటన్నింటినీ పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. ప్రస్తుతానికైతే అందరి పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎవరు బాధ్యులనేది తేలిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

gorakhpur-food-poisoning
రస్​మలాయ్ పాత్రను తనిఖీ చేస్తున్న అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.