దొరకని తల్లి జాడ.. తిరుపతి జూ పార్కుకు కూనలు

author img

By

Published : Mar 10, 2023, 10:12 AM IST

TIGER CUBS

TIGER CUBS: నాలుగురోజుల క్రితం తప్పిపోయిన పులి కూనలను.. వాటి తల్లి వద్దకు చేర్చేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో బయటికి తీసుకొచ్చి ఎదురుచూసినా తల్లి జాడ మాత్రం దొరకలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో ఆ కూనలకు తిరుపతి జూ పార్కుకు తరలించారు.

TIGER CUBS: పులి పిల్లలను.. తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం.. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 6వ తేదీన 4 పులి పిల్లలు లభ్యమయ్యాయి. వీటిని తల్లి వద్దకు చేర్చేందుకు నిర్ణయించిన అధికారులు.. పులి జాడ కోసం తీవ్రంగా అన్వేషించారు.

ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులి జాడ కోసం 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 3 వందల మంది సిబ్బందితో గాలింపు చేపట్టారు. కొత్తపల్లి మండలం ముసలిమడుగు సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో.. పాదముద్రలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోనే తల్లి పులితో పిల్లలను కలిపేందుకు రెండుసార్లు యత్నించి విఫలమయ్యారు.

తిరుపతి జూ కు తరలింపు: పులి కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో 4 పులి పిల్లలను తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఆత్మకూరు నుంచి వీటిని ప్రత్యేక వాహనంలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో తిరుపతికి తరలించారు. నాలుగు ఆడ పులిపిల్లల ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటిని రెండేళ్ల పాటు జూలో సంరక్షించి.. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో పిల్లల వద్దకు వచ్చేందుకు పులి తల్లి ఇష్టపడటం లేదని తాము భావిస్తున్నామన్నారు. అధికారుల యత్నాలు ఫలించక పోవడంతో.. తల్లి వద్దకు పులి పిల్లలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

"తప్పిపోయిన పులి పిల్లలను.. వాటి తల్లితో కలపడానికి చాలా ప్రయత్నాలు చేశాం. పులి జాడలను పరిశీలించిన అనంతరం.. కమిటీ నిర్ణయం మేరకు అన్ని రకాలుగా ఆలోచించి తిరుపతి జూకు తరలించాలని నిర్ణయించాము. తిరుపతి జూలో రెండు సంవత్సరాల తర్వాత.. ఆ పులి పిల్లలకు వేట ఆడటం వచ్చిన తర్వాత వాటిని నల్లమల్ల అడవిలో విడిచిపెడతాం. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం"-శ్రీనివాస రెడ్డి, ఫీల్డ్​ డైరెక్టర్​

అర్ధరాత్రి పులి కోసం ఎదురుచూపులు: పులి సమాచారం తెలియడంతో బుధవారం అర్ధరాత్రి పెద్దగుమ్మడాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి పులి పిల్లలను తీసుకెళ్లిన అధికారులు ఎన్‌క్లోజరులో వాటిని ఉంచి తల్లి కోసం నిరీక్షించారు. పిల్లలు భయపడటం, ఆరుబయట కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బైర్లూటిలోని అటవీ శాఖ అతిథి గృహానికి తీసుకొచ్చేశారు. వీటి తల్లి టి-108.. నల్లమల అటవీ ప్రాంతంలోనే సంచరిస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అది ఆరోగ్యంగానే ఉందని, పులి పిల్లలు లభించిన ప్రాంతంతో పాటు నీటికుంట ప్రాంతాలు, ముసలిమడుగు గ్రామ పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.