ETV Bharat / bharat

'కేంద్రం మోసం చేసింది'.. దేశవ్యాప్త నిరసనలకు రైతు సంఘాల పిలుపు

author img

By

Published : Jan 31, 2022, 8:00 AM IST

Farmers protest 2022: వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

farmers protest 2022
farmers protest 2022

Farmers protest 2022: రైతు సంఘాల నాయకులు మరోసారి నిరసనలకు పిలుపునిచ్చారు. గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ ఆదివారం ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), బీకేయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'ద్రోహ దినం' పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Samyukt Kisan Morcha protest

డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే దిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా కొనసాగిన నిరసనలను ఉపసంహరించుకున్నామని, అయితే వాటిని నెరవేర్చడం లేదని టికాయిత్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ 2020 నవంబర్‌లో రైతులు ఆందోళనలు ప్రారంభించారు. దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా నిరసనలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఈ క్రమంలోనే నిరసనల సమయంలో రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం.. ఎస్‌కేఎం నేతలకు లేఖ పంపింది. దీంతో రైతులు గతేడాది డిసెంబరులో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేశారు. కానీ, ఆ హామీలను అమలు చేయడం లేదంటూ తాజాగా మరోసారి నిరసనలకు దిగనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: శునకాన్ని చంపినందుకు యువకుడిపై దాడి.. ఆపై ఉరి వేసి...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.