రైల్లో ప్రయాణికురాలిపై మూత్రం పోసిన టీటీఈ.. వెంటనే డిస్మిస్ చేసిన మంత్రి

author img

By

Published : Mar 14, 2023, 4:51 PM IST

Updated : Mar 14, 2023, 6:29 PM IST

man passed urine in amritsar train

ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు ఓ రైల్వే టీటీఈ. ఈ దారుణ ఘటన అమృత్​సర్​ నుంచి కోల్​కతా వెళ్తున్న అకల్‌ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. అమృత్​సర్ నుంచి కోల్​కతా వెళ్తున్న అకల్‌ తఖ్త్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ టీటీఈ.. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. దీనిని గమనించిన మహిళ భర్తతో పాటు తోటి ప్రయాణికులు రైల్వే టీటీఈని పట్టుకుని లఖ్​నవూలోని చార్​బాగ్​ రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అరెస్ట్ చేశారు.

బిహార్​కు చెందిన రాజేష్​ కుమార్​ దంపతులు అకల్​తఖ్త్​ రైలులో ప్రయాణిస్తున్నారు. వీరు బిహార్​లోని కియుల్​ ప్రాంతం నుంచి పంజాబ్​లోని​ అమృత్​సర్​కు వెళ్తున్నారు. అప్పుడు మద్యం మత్తులో ఉన్న టీటీఈ మున్నా కుమార్.. రాజేశ్ కుమార్ భార్యపై మూత్రం పోశాడు. దీంతో అతడిని ప్రయాణికులు, బాధితురాలి భర్త కలిసి రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడు మున్నా కుమార్.. స్వస్థలం బిహారే కావడం గమనార్హం. మహిళ, ఆమె భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

​రైల్లో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై అరెస్టైన టీటీఈని రెల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు అధికారులు విధుల నుంచి తొలగించారు. నిందితుడు బాధ్యత గల రైల్వే ఉద్యోగంలో ఉండి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మూత్ర విసర్జన చర్య వల్ల నిందితుడితో పాటు రైల్వే శాఖ మొత్తానికి అపఖ్యాతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

విమాన ప్రయాణికులపై..
ఇటీవల ప్రముఖ విమానయాన సంస్థల విమానాల్లో ప్రయాణికులపై జరిగిన మూత్ర విసర్జన సంఘటనలు మరువకముందే తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. గతేడాది నవంబర్​ 26న కూడా అమెరికా నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్​ ఇండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఈ ఘటనలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో విమానంలోని ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మరో ఘటనలో డిసెంబరు 6న ప్యారిస్​ నుంచి దిల్లీకి వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలి దుప్పటిపై ఓ వ్యక్తి కూడా ఇదే విధంగా మూత్రం పోశాడు. ఇవిలా ఉండగా తాజాగా ఫిబ్రవరి 5న కూడా అమెరికన్​ ఎయిర్​లైన్స్​లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి అని ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంలో నిద్రిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Last Updated :Mar 14, 2023, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.