ETV Bharat / bharat

నిద్రలోనే భార్యాభర్తల దారుణ హత్య.. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో..

author img

By

Published : Dec 12, 2022, 8:44 AM IST

ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతోనే వీరిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Couple hacked to death
Couple hacked to death

ఒడిశా కెందుఝర్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. 45ఏళ్ల వ్యక్తిని, అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చేతబడి చేస్తున్నారన్న నెపంతోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దైతరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహి గ్రామంలో ఓ ఇంటి ముందు భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్ర తెలిపారు.

ఘటన సమయంలో తన తండ్రి బహాదా ముర్ము, తల్లి ధని(35) ఆరుబయట నిద్రిస్తున్నారని మృతుల కుమార్తె సింగో తెలిపింది. 'శనివారం రాత్రి నేను ఇంట్లోనే నిద్రపోయా. అర్ధరాత్రి బయటి నుంచి అరుపులు వినిపించాయి. వెళ్లి చూసేసరికి నా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు' అని సింగో వివరించింది. వెంటనే తన మేనమాన కిసాన్ మారండికి ఫోన్ చేసి పిలిచినట్లు తెలిపింది. 'నాకు అర్ధరాత్రి 12.30 గంటలకు సింగో నుంచి కాల్ వచ్చింది. నా పెద్ద కుమారుడిని వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాం. వారు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం తరలించారు' అని కిసాన్ మారండి వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.