కర్ణాటక సీఎల్​పీ నేతగా సిద్ధరామయ్య ఏకగ్రీవ ఎన్నిక

author img

By

Published : May 18, 2023, 8:56 PM IST

Updated : May 18, 2023, 10:49 PM IST

Congress Legislative Party approved the name of Siddaramaiah as the CLP leader in karnataka cm siddaramaiah

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎల్​పీ నేతగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​ను కలిశారు.

Karnataka CM : కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్​ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీఎల్​పీ నేతగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. బెంగళూరులోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో సిద్ధరామయ్య పేరును పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ ప్రతిపాదించారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా సిద్ధరామయ్య పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖ ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఈసారి కేవలం ఒక్కరికే ఉపముఖ్యమంత్రిగా అవకాశం రావడం వల్ల మిగతా సీనియర్​ ఎమ్మెల్యేలంతా తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.

Congress Legislative Party approved the name of Siddaramaiah as the CLP leader in karnataka cm siddaramaiah
సిద్ధరామయ్యకు పుష్పగుచ్ఛం ఇస్తున్న కాంగ్రెస్​ నేతలు

సీఎల్​పీ నేత హోదాతో పాటు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకన్నట్లు ఇదే సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, జితేంద్ర, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే పాల్గొన్నారు. కేవలం 20 నిమిషాల్లోనే సీఎల్​పీ సమావేశం ముగిసింది.

గవర్నర్​ను కలిసిన నేతలు
సీఎల్​పీ సమావేశం ముగిసిన అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్​ సహా పార్టీ ముఖ్య నేతలంతా రాజ్​భవన్​ వెళ్లి గవర్నర్​ థావర్‌చంద్ గెహ్లోత్‌​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరుతూ.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని మెజారిటీ శాసనసభ్యులు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు సమర్పించారు. అనంతరం గవర్నర్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన​కు శుభకాంక్షలు తెలిపారు.

Congress Leaders Met Karnataka Governor To Attend Oath Cermony
రాజ్​భవన్​లో గవర్నర్ వద్ద సిద్ధరామయ్య, డీకే శివకుమార్​ తదితరులు

మాజీ సీఎం అభినందనలు!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్యకు అభినందనలు తెలిపారు మాజీ సీఎం బసవరాజ్​ బొమ్మై. 'మీరు కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను' అని ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

మే20న ప్రమాణస్వీకారం
మే 20న(శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవా స్టేడియంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా కేపీసీసీ ఛీప్​ డీకే శివకుమార్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా అదే రోజు ఏర్పాటు కానుందని కాంగ్రెస్ హైకమాండ్​ గురువారం ఉదయం ప్రకటించింది. కాగా, మే13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు సీఎల్​పీ సమావేశమైంది. ఈ భేటీలో కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధిష్ఠానం తీర్మానించింది.

Karnataka Election Results : 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకకు మే 10న ఎన్నికలు జరగ్గా.. మే13న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్​ పార్టీ 135 స్థానాలను గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 మ్యాజిక్​ ఫిగర్​ను దాటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీకి 66 స్థానాలు రాగా.. జేడీఎస్​ 19 చోట్ల గెలిచింది.

Last Updated :May 18, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.