కేంద్రం X సుప్రీంకోర్టు.. లక్ష్మణ రేఖను గుర్తు చేసిన రిజిజు.. సీజేఐ కౌంటర్!

author img

By

Published : Mar 18, 2023, 7:29 PM IST

cji chandrachud on collegium

ఏ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని, అయితే జడ్జీల నియామక ప్రక్రియలో ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం.. ఉత్తమమైన వ్యవస్థ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొలీజియం వ్యవస్థ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో విభేదాలు తదితర అంశాలపై స్పందించారు. అంతకుముందు, ప్రతి వ్యవస్థకు లక్ష్మణ రేఖ ఉంటుందని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.

కొలీజియం వ్యవస్థపై అభిప్రాయ భేదాలతో కార్యనిర్వాహక, న్యాయశాఖలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థకు లక్ష్మణ రేఖ ఉందంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించగా.. జడ్జీల నియామకానికి అత్యుత్తమ వ్యవస్థ కొలీజియమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు 'భారతీయత'ను జోడించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. స్థానిక బాషలతోనే ప్రజలకు చేరువ కాగలమని అన్నారు. ఏ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని, అయితే జడ్జీల నియామక ప్రక్రియలో మనం రూపొందించుకున్న కొలీజియం.. ఉత్తమమైన వ్యవస్థ అని తెలిపారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొలీజియం వ్యవస్థ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో విభేదాలు తదితర అంశాలపై స్పందించారు.

"న్యాయవ్యవస్థలో భారతీయతను తీసుకురావాలి. అందులో మొట్టమొదటిది కోర్టుల్లో ఉపయోగించే భాషను మార్చాలి. జిల్లా కోర్టుల్లో వాదనలు కేవలం ఇంగ్లీష్‌లోనే ఉండకపోవచ్చు. కానీ పై కోర్టులు సహా సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాల్లో ఇంగ్లీష్‌లోనే వాదిస్తున్నారు. అది ఆంగ్ల భాషలో ఉన్న సౌలభ్యం వల్లనో.. లేదా వలస వారసత్వం వల్లనో కావొచ్చు. కానీ, ప్రజలకు నిజంగా చేరువవ్వాలంటే మాత్రం వారికి అర్థమయ్యే భాషలోనే వాదనలు జరగాలి. అందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టాం."
-జస్టిస్​ డీవై చంద్రచూడ్​, సీజేఐ

ఎవరి అభిప్రాయం వారిదే..
కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం గురించి సీజేఐ స్పందించారు. ఏ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని చెప్పిన సీజేఐ చంద్రచూడ్​.. జడ్జీల నియామక ప్రక్రియలో మనం రూపొందించుకున్న కొలీజియం ఉత్తమమైన వ్యవస్థ అని చెప్పారు. "ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజుతో వాదనలు చేయాలని అనుకోవడం లేదు. ఇద్దరికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే తప్పేంటి? న్యాయవ్యవస్థలోనూ అభిప్రాయభేదాలు ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ.. కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పారు. న్యాయమూర్తిగా తన 23 ఏళ్ల కెరీర్‌లో ఏదైనా కేసు విషయం ఇలాంటి తీర్పు ఇవ్వమని ఎవరూ తనకు చెప్పలేదని సీజేఐ వెల్లడించారు.

'లక్ష్మణ రేఖ ఉంది'
అంతకుముందు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ సహా అనేక సంస్థలకు.. రాజ్యాంగ లక్ష్మణ రేఖ ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పాలనాపరమైన నియామకాల్లో జడ్జీలు భాగమైతే.. తీర్పులు ఎవరు చెప్పాలని దిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రశ్నించారు. చట్టంచేసే వరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌, మిగతా ఇద్దరు కమిషనర్ల నియామకానికి.. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై కిరణ్‌ రిజిజు ఈ మేరకు స్పందించారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం ఎలా చేపట్టాలో రాజ్యాంగంలో ఉందన్నారు. అందుకోసం పార్లమెంటు చట్టం చేయాల్సి ఉందని, ఆ విధంగానే ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం జరగాల్సి ఉందని కేంద్రమంత్రి తెలిపారు. అయితే పార్లమెంటు ఇప్పటివరకు అలాంటి చట్టం చేయలేదని, ఆ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తాను సుప్రీంకోర్టు తీర్పులను విమర్శించడం లేదా దాని ప్రతిఫలాల గురించి లేదా ఈ అంశాలపై ప్రభుత్వం ఏమి చేయబోతోందనే విషయమై మాట్లాడటం లేదని కిరణ్‌ రిజిజు చెప్పారు.

కొందరు విశ్రాంత న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు.. భారత వ్యతిరేక ముఠాతో కలిసి న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పాత్ర పోషించేలా చేస్తున్నాయని విమర్శించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. "భారత వ్యతిరేక శక్తులు దేశం లోపల, వెలుపల ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. మానవ హక్కులు లేవని అంటున్నారు. వారు ఏ భాష అయితే ఉపయోగిస్తారో రాహుల్​ గాంధీ కూడా అదే భాషను వాడుతున్నారు" అని చెప్పారు.

తుది నిర్ణయం సీజేఐదే!
ఇదిలా ఉండగా, మాజీ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సైతం కొలీజియం వ్యవస్థకు మద్దతుగా మాట్లాడారు. అయితే, నియామకాల్లో కార్యనిర్వాహక విభాగం అభిప్రాయం కూడా ముఖ్యమేనని అన్నారు. తాను సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్నప్పుడు కార్యనిర్వాహక శాఖ.. న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు జరగలేదని చెప్పారు. 'ప్రతి కేసును తనకు అనుకూలమైన బెంచ్ వద్దకు వెళ్లేలా చేసుకోవడం ద్వారా న్యాయశాఖకు కార్యనిర్వాహక విభాగం అడ్డు తగలొచ్చు. కానీ, నా హయాంలో అలా జరగలేదు. సీజేఐ సిద్ధం చేసే రోస్టర్ విధానంలో ఎవరి ఒత్తిడి ఉండదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు.. విధి నిర్వహణలో భిన్నంగా ఉంటాయి. లక్ష్యాలు మాత్రం ఒకటే. జడ్జిల నియామకాల్లో ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవడం ముఖ్యమే. వారి (ప్రభుత్వం) వద్ద నిఘా వర్గాల సమాచారం ఉంటుంది. ఓ వ్యక్తి జడ్జి పదవికి అర్హులా? కాదా? అనేది వారు చెప్పగలుగుతారు. ఈ విషయంలో సీజేఐ, కొలీజియం.. ప్రభుత్వం నుంచి అభిప్రాయం తీసుకోవాలి. కానీ, తుది నిర్ణయం మాత్రం సీజేఐదే ఉండాలి' అని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు.

ఇవీ చదవండి : వందోసారి కాశీ ఆలయ దర్శనం.. యూపీ సీఎం అరుదైన ఘనత

ఆస్పత్రిలో దారుణం.. 7నెలలుగా చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అత్యాచారం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.