ETV Bharat / bharat

'చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోంది'.. రాహుల్​ ఫైర్​!

author img

By

Published : Dec 16, 2022, 7:04 PM IST

మన దేశంపై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. రాజస్థాన్​లో భారత్​ జోడో యాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో రాహుల్​ ఆ వ్యాఖ్యలు చేశారు.

Bharat Jodo Yatra
Bharat Jodo Yatra

Rahul Gandhi India China: పొరుగు దేశం చైనా మనపై యుద్ధానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆరోపించారు. అసలు ముప్పేలేనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే విషయాన్ని తాను గడిచిన రెండేళ్లుగా చెబుతున్నానని తెలిపారు. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్‌ సెక్టార్‌ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ దీనిపై స్పందించారు. ఆయన చేపట్టిన 'భారత్‌ జోడో యాత్ర' వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో విలేకరులతో మాట్లాడారు.

"చైనా నుంచి ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. వారు చొరబాటు కోసం కాదు.. యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని రెండుమూడేళ్లుగా చెబుతున్నా. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాల్లో పట్టీపట్టనట్లు వ్యవహరించడం తగదు. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లో వారు ప్రమాదకరంగా సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. మన ప్రభుత్వం నిద్రపోతోంది" అని విమర్శించారు. "చైనా సన్నాహాలపై ఎవరి మాటా వినకూడదని ఈ ప్రభుత్వం అనుకుంటోంది. వారు ఉపయోగిస్తున్న ఆయుధ సంపత్తి, వారు చేస్తున్నది చూస్తుంటే యుద్ధానికి సిద్ధమవుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ మన ప్రభుత్వం ఈ విషయాన్ని దాస్తోంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేయడం లేదని విమర్శించారు.

భాజపాను ఓడించేది మేమే
భారతీయ జనతా పార్టీని గద్దె దించేది కాంగ్రెస్‌ పార్టీనేనని రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పనైపోయిందని చాలా మంది ఊహించుకుంటున్నారని, కానీ, భాజపాను ఓడించేది తామేనన్న విషయాన్ని నోట్‌ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారని, వారిని సమర్థంగా వినియోగించుకుంటే రాజస్థాన్‌లో మరోసారి కాంగ్రెస్‌ పార్టీదే గెలుపని విశ్వాసం వ్యక్తంచేశారు. భాజపాపై పోరాడే సత్తా లేనివారు పార్టీని వీడాలని మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీపై విశ్వాసం ఉన్నవాళ్లు మాత్రమే ఉండాలని సూచించారు. తాను చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు రాజస్థాన్‌ సహా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలే కాదు.. ప్రజలు సైతం ఆదరిస్తున్నారని చెప్పారు.

ఆప్‌ లేకుంటే..
గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీసిందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఒకవేళ ఆప్‌ పోటీలో లేకపోయి ఉంటే భాజపాను కాంగ్రెస్‌ పార్టీ ఓడించి ఉండేదని చెప్పారు. ఆప్‌ భాజపాకు బీటీమ్‌ అని, తమ పార్టీని దెబ్బతీయడానికి భాజపాతో ఆ పార్టీ కుమ్మక్కైందని రాహుల్‌ విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.