'కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం'

author img

By

Published : Jun 20, 2021, 12:46 PM IST

SC

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించలేమని కేంద్రం.. సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. బాధిత కుటుంబాలకు నాలుగేసి లక్షల చొప్పున పరిహారం అందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక మందికి వివిధ రూపాల్లో పరిహారం అందించామని.. ఈ అంశంపై చాలా రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది కేంద్రం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి నివారణకు భారీ మొత్తాన్ని ఖర్చు చేశాయని.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఆర్థిక వ్యవస్థపై భారం పడినప్పటికీ.. అవసరంలో ఉన్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నాయని తెలిపింది. ఆర్థిక అవరోధాలు, ఇతర కారణాల వల్ల కరోనా మృతుల బంధువులకు పరిహారాన్ని చెల్లించలేమని కేంద్రం వివరించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 3 లక్షల 86 వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వారందరి కుటుంబాలకు పరిహారం అందించాలంటే ఎస్​డీఆర్​ఎఫ్ నిధులన్నీ ఖర్చు అవుతాయని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందన్న కేంద్రం.. ఈ చట్టం కింద కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించలేమని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: 'అనాథల అక్రమ దత్తతలపై చర్యలు తీసుకోండి'

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.