ETV Bharat / bharat

YS Viveka Case: అవినాష్​ రెడ్డిని అరెస్టు చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది: సీబీఐ

author img

By

Published : May 3, 2023, 4:04 PM IST

Updated : May 3, 2023, 6:29 PM IST

cbi counter petition
avinash reddy

15:58 May 03

హైకోర్టులో కౌంటర్ వేసిన సీబీఐ

CBI Counter Petition: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి... కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్పష్టంచేసింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టులో ఇటీవలే కౌంటర్‌ దాఖలు చేసింది. వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలను కౌంటర్‌లో పేర్కొంది.

4 కోట్ల లావాదేవీలపై: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇటీవల సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. వివేకానందరెడ్డి హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడుందో విచారణలో తెలుసుకోవాల్సి ఉందన్న సీబీఐ... హత్యకు ముందు నిందితులతో జరిగిన 4 కోట్ల లావాదేవీలపైనా ప్రశ్నిస్తామని తెలిపింది. హత్యకేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌తో అవినాష్‌రెడ్డికి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలని... హత్య రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకెళ్లాడో తేల్చాల‌ని కౌంటర్‌లో పేర్కొంది. హత్య కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో, మార్చి 15న అవినాష్‌రెడ్డి ఎక్కడ ఉన్నారో నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు సీబీఐతెలిపింది.

10 కోట్ల ఆఫర్‌: నేరాన్ని తనపై వేసుకుంటే 10 కోట్లు ఇస్తామంటూ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేసినట్లు గంగాధర్‌రెడ్డి చెప్పారని... అందులో వాస్తవం ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు నివేదించింది. అలాగే దస్తగిరిని ఓబుల్‌రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారనే విషయంతోపాటు... వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని తెలుసుకుంటామని హైకోర్టుకు వివరించింది. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేసిన కుట్రలో అవినాష్‌రెడ్డి భాగమేనన్న సీబీఐ... దురుద్దేశపూర్వకంగానే దర్యాప్తునకు సహకరించట్లేదన్న స్పష్టంచేసింది. ఇటీవల విచారణ చేసినప్పుడు తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దాటవేశారని, అలాగే వాస్తవాలు చెప్పలేదని హైకోర్టుకు నివేదించింది. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాష్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారని వివరించింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలిపింది.

సాక్షులు భయపడుతున్నారు: అవినాష్‌రెడ్డి బయట ఉంటే ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు భయపడుతున్నారని... అవినాష్‌రెడ్డి అనుచరుల వల్ల దర్యాప్తునకు ఆటంకం కలిగినట్లు కౌంటర్‌లో పేర్కొంది. సాక్షులను అవినాష్‌రెడ్డి ప్రభావితం చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి, అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య, సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాక మాట మార్చి, ఆ తర్వాత హత్యకు గురైన గంగాధర్‌రెడ్డి.... అవినాష్‌రెడ్డి కారమంగా ప్రభావితమైనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత ర్యాలీలు నిర్వహించడం, సాక్షులను ప్రభావితం చేయడమేనని స్పష్టంచేసింది.

అవినాష్‌రెడ్డిపై 4 క్రిమినల్ కేసులు: అవినాష్‌రెడ్డికి నేరచరిత్ర ఉందన్న సీబీఐ... ఆయనపై 4 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. వివేకా హత్యలో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాల్లేవని సీబీఐ పునరుద్ఘాటించింది. షమీమ్‌ను వివేకా పెళ్లి చేసుకోవడం శివప్రకాష్‌రెడ్డికి ఇష్టం లేదని... అయితే షమీమ్‌తో పెళ్లికి, వివేకా హత్యకు సంబంధం లేదని స్పష్టంచేసింది. వివేకా రాసిన లేఖను దాచడంలో దురుద్దేశం కనిపించట్లేదన్న సీబీఐ... తాము వచ్చే వరకు పక్కన ఉంచాలని వివేకా పీఏకు రాజశేఖర్‌రెడ్డి చెప్పారని హైకోర్టుకు నివేదించింది. హైదరాబాద్‌ నుంచి పులివెందులకు వచ్చిన తర్వాత సునీత, రాజశేఖర్‌రెడ్డి స్వయంగా లేఖను పోలీసులకు ఇచ్చారని గుర్తుచేసింది. ఉదయాన్నే లేఖను దాచిపెట్టడం వల్లే కాపాడగలిగారని కౌంటర్‌లో పేర్కొంది. కడప ఎంపీ టికెట్ తనకివ్వాలని వివేకానందరెడ్డి అడిగారని, లేదంటే షర్మిల, విజయమ్మల్లో ఒకరికి ఇవ్వాల్సిందిగా కోరారని తెలిపింది. కడప నుంచి పోటీ చేసేలా షర్మిలను వివేకానందరెడ్డి ఒప్పించారని హైకోర్టుకు తెలియజేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.