ETV Bharat / bharat

పాక్‌ చొరబాట్లకు రాడార్లతో చెక్.. సొరంగాలను గుర్తించే లేటెస్ట్ టెక్నాలజీ

author img

By

Published : Jan 8, 2023, 6:07 PM IST

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లకు సైన్యం చెక్‌ పెట్టనుంది. భూమి లోపల సొరంగాల ద్వారా పాక్‌ భూభాగం నుంచి భారత్‌లోకి వచ్చే ఉగ్రవాదులు, ఆయుధాలు, మత్తు పదార్థాలను గుర్తించేందుకు సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశీయంగా తయారైన ఈ సాంకేతిక పరికరం సాయంతో భూమి లోపల సొరంగాలను గుర్తించి ఉగ్రకుట్రలను భగ్నం చేసేందుకు సరిహద్దు భద్రత దళం సిద్ధమైంది.

drone ground penetrating radar
drone ground penetrating radar

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌లో అక్రమంగా చొరబాట్లను అడ్డుకునేందుకు సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికత సాయంతో డేగ కన్ను వేసి.. సరిహద్దుల్లో గస్తీని మరింత ముమ్మరం చేయనుంది. మొట్టమొదటిసారి జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ మౌంటెడ్ గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్లను సరిహద్దు భద్రతా దళం మోహరించింది. వీటి సాయంతో భూమి లోపల ఉన్న సొరంగాలను పైనుంచే గుర్తించేందుకు వీలుంటుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు భారత భూభాగంలోకి సొరంగాల నుంచి ఉగ్రమూకలు చొరబడకుండా అడ్డుకునేందుకు దేశీయంగా తయారుచేసిన ఈ సాంకేతిక పరికరం సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. ఆయుధాలు, మత్తు పదార్థాలను అక్రమంగా భారత్‌లోకి తరలించేందుకు ప్రయత్నించినా ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ గుర్తుపడుతుంది.

ఈ రాడార్ల నుంచి వచ్చే బలమైన రేడియో తరంగాలు సొరంగాలను గుర్తించడానికి, వాటి మార్గాన్ని కనుగొనేందుకు ఉపయోగపడతాయని బీఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు. ఈ రాడార్లకు సంబంధించి మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఈ రాడార్లను డ్రోన్లకు ముందు భాగంలో అమర్చడం వల్ల సైన్యం వెళ్లలేని ప్రాంతాలకు కూడా వెళ్లి సొరంగాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు వివరించారు. సాధారణంగా సరిహద్దు కంచెకు 400 మీటర్ల దూరంలో ఉన్న సొరంగాలను గుర్తించే సామర్థ్యం ఈ రాడార్లు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. డ్రోన్ల సాయంతో రాడార్ల ద్వారా బీఎస్​ఎఫ్​ సిబ్బంది సొరంగాలను గుర్తించవచ్చని తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌తో 192 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో గత 3 ఏళ్లలో దాదాపు 5 సొరంగాలను బీఎస్​ఎఫ్​ గుర్తించింది. ఇందులో గత 3 ఏళ్లలో వెలుగులోకి వచ్చిన సొరంగాలన్నీ జమ్ములోని ఇంద్రేశ్వర్‌ నగర్‌ సెక్టార్‌లోనే ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించే సొరంగాలను ఈ రాడార్లు గుర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: 'జోడో యాత్ర నాకు తపస్సుతో సమానం.. కొందరి చేతుల్లోనే సంపద, మీడియా'

'వారు వేగంగా స్పందిస్తే బాగుండేది'.. మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.