ETV Bharat / bharat

11వేల ఓల్టేజ్ కరెంట్ తీగ తగిలి నలుగురు మహిళలు మృతి.. పొలంలో పని చేస్తుండగా..

author img

By

Published : Jun 27, 2023, 10:19 PM IST

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. పొలంలో వరి నాట్లు వేస్తుండగా 11వేల ఓల్టేజ్​ కరెంట్ తీగ తగిలి నలుగురు మహిళలు మరణించగా.. మరో ఇద్దరు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

bihar crime news
కరెంట్ షాక్​తో 4గురు మహిళలు మృతి

పొలంలో కూలీ పని చేసేందుకు వచ్చిన నలుగురు మహిళలు కరెంట్ షాక్​తో మృతిచెందారు. వరి నాట్లు వేస్తుండగా 11వేల ఓల్టేజ్​ ఉన్న కరెంట్ తీగ తగిలడం వల్ల నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారు పనిలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషాదకర ఘటన బిహార్ పూర్ణియాలో జరిగింది.

ఇదీ జరిగింది..
పూర్ణియా సమీపంలోని గోడియర్ గ్రామంలో విషాదం జరిగింది. పొలంలో మహిళలు వరి నాట్లు వేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్న కరెంట్ స్తంభం నుంచి 11000 ఓల్టేజ్​ ఉన్న విద్యుత్​ తీగ పొలంలో పడింది. పనిలో నిమగ్నమైన ఆరుగురు మహిళలు అనుకోకుండా ఆ కరెంట్ తీగకు తగిలి ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే నలుగురు మహిళలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా కాలిన మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

"ఆ కరెంట్ తీగ చాలా రోజుల నాటిది. అందుకే తెగి పొలంలో పడి ఉంటుంది. వారికి షాక్ తగిలిందని తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి తరలించాం. కానీ అప్పటికే నలుగురు మరణించారని వైద్యులు తెలిపారు. గ్రామంలో పాతకాలం నాటి తీగలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. విద్యుత్ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు."
-స్థానికుడు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మరణించిన నలుగురిని రేణు దేవీ, బీనా దేవీ, రాణీ దేవీ, రవితా దేవీలుగా.. గాయపడ్డవారిని సులేఖ దేవీ, జులేఖ దేవీలుగా పోలీసులు గుర్తించారు.

bihar crime news
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మహిళలు

కరెంట్ షాక్​లో ఆరుగుకు కూలీలు మృతి..
గతనెల ఇలాంటి ఘటనే ఝార్ఖండ్​లో జరిగింది. రైల్వే పట్టాల పక్కన విద్యుత్​ స్తంభం ఏర్పాటు చేస్తుండగా..ఆరుగురు కూలీలు మరణించారు. విద్యుత్ స్తంభం.. హైటెన్షన్​ వైర్లను తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే డీఆర్‌ఎం.. ఘటనపై విచారణ జరిపేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ తీవ్ర నిర్లక్ష్యం వల్లే కూలీలు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.