ETV Bharat / bharat

'ఎమ్మెల్యేల కోసం బేరాలాడుతున్న వీడియోలు చూశాం.. వాటి గురించి మాట్లాడరేం?'

author img

By

Published : Nov 9, 2022, 8:20 PM IST

అవినీతిపరులే దేశాన్ని నాశనం చేస్తున్నారని.. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఆ కేసుల నుంచి బయటపడుతున్నారని వ్యాఖ్యానించింది. సామాజిక కార్యకర్త గౌతమ్ నావలఖ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

sc on gautham navlakha case
sc on gautham navlakha case

భీమాకోరెగాం కేసులో అరెస్టయిన తనను జుడీషియల్ కస్టడీలో కాకుండా ఆరోగ్య సమస్యల దృష్ట్యా గృహనిర్బంధం చేయాలంటూ సామాజిక కార్యకర్త గౌతమ్‌ నావలఖ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్‌ SV రాజు.. గౌతమ్‌ అభ్యర్థనను వ్యతిరేకించారు. నావలఖ వంటివారు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, వారి పనే అది అని తెలిపారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం వాస్తవంగా దేశాన్ని ఎవరు నాశనం చేస్తున్నారో మీకు తెలుసా అని ఏఎస్​జీని ప్రశ్నించింది.

అవినీతిపరుల వల్లే దేశం నాశనం అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ జరుగుతున్న విషయాలు తెలుస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా అవినీతిపరులపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదని మండిపడింది. ఇటీవల.. ఎన్నికైన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయల్లో బేరాలు ఆడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలను చూశామని గుర్తుచేసింది. అయినప్పటికీ కళ్లు మూసుకొని ఉన్నామని వ్యాఖ్యానించింది. వారు దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులూ చేయడం లేదని మీరు చెబుతున్నారా? అని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

మీరు వారిని సమర్థించకపోయినప్పటికీ వారు ఉత్సాహంగా ముందుకెళుతూనే ఉన్నారని పేర్కొంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు డబ్బు సంచులు సాయపడుతున్నాయని వ్యాఖ్యానించింది. అయితే అవినీతిపరులను తాము సమర్థించడం లేదని., వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అదనపు సొలిసిటర్ జనరల్‌ అన్నారు. గౌతమ్‌ నావలఖను గృహనిర్భందంలో ఉంచుతామన్న కోర్టు అందుకు ఎలాంటి నిబంధనలు పెడతారో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్​ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి

కాపీ కొట్టాడని విద్యార్థిపై ఫిర్యాదు.. 14వ అంతస్తు నుంచి దూకి బాలుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.