ETV Bharat / bharat

అంజలి కేసులో డ్రగ్స్‌ కోణం? కీలకంగా మారుతున్న స్నేహితురాలు నిధి!

author img

By

Published : Jan 7, 2023, 5:20 PM IST

anjali friend nidhi role in delhi scooty girl death case
దిల్లీ యువతి అంజలి కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ అంజలి కేసులో..కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంజలి స్నేహితురాలు నిధి.. గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నిధి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నట్లు..దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఫలితంగా అంజలి కేసులో.. కుట్ర కోణం ఏదైనా ఉందేమోనని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కొత్త సంవత్సరాది వేళ..దేశరాజధాని దిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో.. పోలీసులు విస్తుపోయే నిజాలు వెల్లడిస్తున్నారు. ఘటన జరిగి సమయంలో స్కూటీపై.. అంజలితోపాటు ప్రయాణిస్తున్న ఆమె స్నేహితురాలు నిధి గురించి.. కీలక విషయాలు బయటపెట్టారు. గతంలో ఆమె మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2020 డిసెంబరులో తెలంగాణ నుంచి దిల్లీకి గంజాయి రవాణా చేస్తుండగా..ఆగ్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికినట్లు తెలిపారు. ఈ కేసులో నిధితోపాటు.. మరో ఇద్దరు అరెస్టయ్యారని, ప్రస్తుతం ఆమె ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చినట్లు వివరించారు.

నిధికి గతంలో నేర చరిత్ర ఉండటం వల్ల... అంజలి కేసులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజలి విషయంలో నిధి చెప్పిన అంశాలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం సేవించిందని నిధి మీడియాకు చెప్పింది. అయితే శవపరీక్ష నివేదికలో మద్యం ఆనవాళ్లు లేవని అంజలి తరఫు న్యాయవాది చెప్పడం వల్ల నిధి పొంతన లేని విషయాలు చెప్పినట్లు అనుమానిస్తున్నారు. మద్యం సేవించి ఉన్నప్పటికీ..స్కూటీ తానే నడుపుతానని అంజలి పట్టుబట్టిందని నిధి తెలిపింది. కారు ఢీకొట్టడం వల్ల అంజలి టైరులో ఇరుక్కుపోయినట్లు పేర్కొంది.ఈ ఘటనతో తాను భయపడి ఇంటికి వెళ్లానని, ఎవరికీ ఈ విషయం చెప్పలేదని విచారణలో నిధి వెల్లడించింది. నిధి ఆరోపణలను అంజలి తల్లి ఖండించారు. అంజలికి మద్యం అలవాటు లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఏడో నిందితుడిని దిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మెుత్తం 18 దిల్లీ పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.