ETV Bharat / bharat

రెండో భర్తతో వీడియో కాల్.. కోపంతో హత్య చేసిన మూడో భర్త

author img

By

Published : Dec 29, 2022, 12:54 PM IST

Updated : Dec 29, 2022, 7:07 PM IST

తనను పెళ్లి చేసుకుని.. రెండో భర్తతో తన ముందే వీడియో కాల్ మాట్లాడుతోందని భార్యను హత్య చేశాడో వ్యక్తి. దిల్లీలోని గాజియాబాద్​లో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

after-video-call-husband-killed-his-wife-in-delhi
భార్య భవ్యతో నిందితుడు వినోద్

దిల్లీలోని గాజియాబాద్​లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకుని.. తన ముందే రెండో భర్తతో వీడియో కాల్ మాట్లాడుతోందని భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్​లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని భవ్య శర్మగా గుర్తించారు. అయితే ఆమె భర్త వినోద్ శర్మ ఘటనా స్థలంలో లేడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. మృతిచెందిన మహిళకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడు పేర్లు ఉన్నాయి. మొదటి పేరు బేబీ, రెండోది అఫ్సానా, మూడోది భవ్య శర్మ. ఇలా ముగ్గురు భర్తల దగ్గర ఒక్కోపేరుతో ఆమె ఉండేది.

భవ్య మొదటి భర్త పేరు యోగేంద్ర కుమార్. అయితే అతడి నుంచి విడిపోయింది. తర్వాత మరో వ్యక్తి అనీస్ అన్సారీని వివాహం చేసుకుంది. ఈ బంధం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. సుమారు 5 నెలల క్రితం వినోద్ శర్మను మూడో వివాహం చేసుకుంది. ఆమె తనతో పాటు రెండో భర్తకు పుట్టిన కుమారుడు ఆదిల్(16)​ను కూడా మూడో భర్త వినోద్​ వద్దకు తీసుకుని వచ్చింది. వారంతా గాజియాబాద్‌లోని కాన్షీరామ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

భవ్య, వినోద్ ఈ నెల 24వ తేదీన మధ్యప్రదేశ్​లోని ఇందోర్​కు వెళ్లారు. ఆమె తన రెండో భర్తతో వీడియో కాల్​లో మాట్లాడుతూ.. ఆ సమయంలో తన ప్రస్తుత భర్త వినోద్​ను పిలిచింది. తన ముందే రెండో భర్తతో వీడియో కాల్ మాట్లాడటం వల్ల.. కోపోద్రిక్తుడైన వినోద్ ఆమెను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత 25 తేదీన గాజియాబాద్​లోని ఇంటికి వచ్చిన తర్వాత భవ్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తన కుమారుడు ఆదిల్​కు డబ్బులిచ్చి బయట ఆడుకోమని వినోద్ పంపించాడు. తర్వాత భవ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు వినోద్ పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.

after-video-call-husband-killed-his-wife-in-delhi
నిందితుడు వినోద్ శర్మ

తనను పెళ్లి చేసుకున్నాక కూడా భవ్య తన రెండో భర్తతో సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ హత్య చేశానని వినోద్ పోలీసులతో చెప్పాడు. హత్య చేసిన తర్వాత వినోద్ నేలపై పడిన రక్తాన్ని టవల్​తో తుడిచి ఇంటిని శుభ్రం చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గదిలో దాచాడు. నిందితుడు రక్తపు మరకలున్న బట్టలన్నీంటిని వాషింగ్ మెషీన్​లో వేశాడు. ఇంతలో ఇంటికి వచ్చిన భవ్య కుమారుడు ఆదిల్​కు.. మీ అమ్మ పడుకుంది అని వినోద్​ చెప్పాడు. ఆదిల్ ఏడుస్తూ ఉండడం వల్ల అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని, ఇంట్లో భవ్య మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఆమె మృతదేహం రోజంతా ఇంట్లోనే ఉంది. నిందితుడు శవాన్ని ఎక్కడో దూరంగా పారేయాలనే పథకం పన్నాడని, అయితే అది కుదరలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Last Updated : Dec 29, 2022, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.