ETV Bharat / bharat

80 శాతం వైకల్యం.. అంతర్జాతీయ మెడల్స్ దాసోహం.. 'పవర్'ఫుల్ బాడీ బిల్డర్ కథ ఇది!

author img

By

Published : Mar 25, 2023, 12:30 PM IST

Updated : Mar 25, 2023, 2:32 PM IST

పోలియో వల్ల వైకల్యం బారిన పడ్డప్పటికీ ఓ యువకుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఓ కాలు పనిచేయకపోయినా.. పవర్ లిఫ్టింగ్​లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. డ్రగ్స్ ప్రభావిత పంజాబ్​లో యువతకు ప్రేరణగా నిలుస్తున్నాడు. అతడి కథేంటో తెలుసుకుందామా?

disabled-youth-giving-youth-gym-training-power-lifting-jatinder-singh
disabled-youth-giving-youth-gym-training-power-lifting-jatinder-singh

80 శాతం వైకల్యం.. అంతర్జాతీయ మెడల్స్ దాసోహం.. 'పవర్'ఫుల్ బాడీ బిల్డర్ కథ ఇది!

80శాతం వైకల్యంతోనూ ఓ యువకుడు సంచలనాలు నమోదు చేస్తున్నాడు. ఓ కాలు పనిచేయకపోయినా.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. పోలియోతో బాధపడుతూనే దేశానికి బంగారు పతకాలు తెచ్చిపెడుతున్నాడు. పంజాబ్​, బఠిండాలోని గంగా గ్రామానికి చెందిన జతిందర్ సింగ్​.. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఓ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల అతడి కాలు పనిచేయకుండా పోయింది. అతడి శరీరంలోని 80 శాతం వైకల్యం బారిన పడింది. అయినప్పటికీ.. జతిందర్ నిరాశకు గురికాలేదు. సంకల్పం కూడగట్టుకున్నాడు. జిమ్​లో చేరి కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కుల్దీప్ శర్మ శిక్షణలో రాటుదేలిన జతిందర్.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు కొల్లగొట్టాడు.

"చిన్నప్పటి నుంచి నాకు పోలియో ఉంది. రెండేళ్ల వయసులో నాకు ఓ వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వైకల్యం వచ్చింది. నా కాలిని పైకి లేపలేను. ఇప్పుడు నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. పవర్​ లిఫ్టింగ్​లో నేను ఇంటర్నేషనల్ ప్లేయర్​ను. జాతీయ స్థాయి పోటీల్లో 10 పతకాలు సాధించా."
-జతిందర్ సింగ్, బాడీ బిల్డర్, పవర్ లిఫ్టింగ్ ప్లేయర్

మంచి డైట్​ ఫాలో అవుతూ బాడీ బిల్డ్ చేసిన జతిందర్.. తొలుత రాష్ట్ర స్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో బంగారు పతకం కైవసం చేసుకున్న అతడు.. జాతీయ స్థాయిలో రాణించడంపై దృష్టిపెట్టాడు. అక్కడా మంచి ప్రదర్శన చేసి.. ఇంటర్నేషనల్ ఈవెంట్​లలో సత్తా చాటాడు. అయితే, తనకు ఏ దశలోనూ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు జతిందర్. అందుకే ఆదాయం కోసం జిమ్​ను నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.

disabled-youth-giving-youth-gym-training-power-lifting-jatinder-singh
బరువులు ఎత్తుతున్న జతిందర్ సింగ్

"నాకు ఉద్యోగం ఏదీ రాలేదు. డ్రగ్స్​కు బానిస కాకుండా ఉండాలని అనుకున్నా. జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నా. చివరకు ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని భావించా. నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయి కాబట్టి సాయం చేస్తారనుకున్నా. కెప్టెన్ (అమరీందర్ సింగ్) సర్కారు ఏదైనా ఉద్యోగం ఇస్తుందేమోనని అనుకున్నా. వారు ఏమీ ఇవ్వలేదు. అప్పటి క్రీడా శాఖ మంత్రిని సైతం సాయం కోసం అభ్యర్థించా. అనేక సార్లు కలిశా. దివ్యాంగుడిని కాబట్టి సాయం చేయాలని కోరా. ఆప్ సర్కారు ఏర్పాటైన తర్వాత కూడా అధికారులను కలిశా. మాట్లాడి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు."
-జతిందర్ సింగ్, బాడీ బిల్డర్, పవర్ లిఫ్టింగ్ ప్లేయర్

యువత డ్రగ్స్ బారిన పడకుండా, ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాలని జతిందర్ సింగ్ పిలుపునిస్తున్నాడు. మాదకద్రవ్యాలకు బానిసై ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టడం ద్వారా ఇలాంటి పరిస్థితి రాకుండా నివారించవచ్చని చెబుతున్నాడు.

disabled-youth-giving-youth-gym-training-power-lifting-jatinder-singh
తనకు వచ్చిన మెడల్స్ చూపిస్తున్న జతిందర్
Last Updated :Mar 25, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.