ఎర్రవల్లిలో అధికారుల సర్వే - భూములపై రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలో భూ సర్వే చేపడుతున్నారు. రికార్డుల్లో పేరు, కబ్జాలో ఉన్నవారు ఒకటేనా అని తేల్చేందుకు సర్వే చేపడుతున్నారు. సర్వేతోనైనా తమ సమస్య తీరుతుందనే ఆశలో సాగుదారులున్నారు.

Published : September 22, 2026 at 8:06 AM IST
Land Survey At Erravalli : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో భూ సర్వే చేపడుతున్న అధికారులు రైతులకు రెండో దఫా నోటీసులు అందించారు. సోమవారం నోటీసులు అందించి మంగళవారం హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం వారికి అందించిన భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్కులు, ప్రొసీడింగ్ కాపీ తీసుకురావాలని సూచించారు. రికార్డుల్లో ఉన్న పేరు, కబ్జాలో ఉన్నవారు ఒకరేనా కాదా? అనే అంశాన్ని అధికారులు నిర్ధారణ చేయనున్నారు.
రాజకీయ వేడి పుట్టించిన ఎర్రవల్లి భూముల అంశం
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టించిన సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలోని ఎర్రవల్లి భూముల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ నెల 17న మొదటి దఫా 80 మంది రైతులకు నోటీసులు ఇచ్చిన అధికారులు, తాజాగా 21వ తేదీన సర్వే చేపట్టారు. మర్కూర్ మండలంలోని ఎర్రవల్లి, వరదరాజపూర్, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దులను కలుపుతూ సర్వే నెంబర్ 325లో 388 ఎకరాల భూమి ఉంది. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి ఎకరం చొప్పున మూడు విడతల్లో ఈ 388 ఎకరాలను అర్హులకు కేటాయించింది.
సీఎం వ్యాఖ్యలతో తెరపైకి
వీరికి పట్టాదారు పాసుబుక్కులతో పాటు ప్రొసీడింగ్ కాపీలను సైతం అందజేసి ఈ అసైన్డ్ భూములకు హక్కుదారులుగా నిర్ణయించింది. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఈ అంశం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో 325 సర్వే అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. నెల రోజుల్లో సర్వే చేసి ఆ భూముల గుట్టు తేల్చాలని ఆదేశించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.
సర్వేకు సహకరించాలని అధికారుల పిలుపు
ఇటీవల జారీ చేసిన నోటీసుల్లో రికార్డుల్లో పేరు ఉన్న వ్యక్తులు పట్టాదారు పాసు పుస్తకాలతో హాజరై కబ్జాలో ఉన్న భూమి సరిహద్దులను చూపించి సర్వేకు సహకరించాలంటూ అధికారులు పేర్కొన్నారు. సుమారు 70 శాతం మంది మాత్రమే హాజరై భూ రికార్డులను, హద్దులను చూపించారు. హాజరు కాని మిగిలిన 30 శాతం మందికి మరోమారు అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు రైతుల దగ్గర సేకరించిన సమాచారాన్ని రోజూ స్థానిక తహసీల్దార్‌కు అందజేస్తున్నారు.
తొలి సర్వేలో వివరాలిలా
సోమవారం నిర్వహించిన 388 ఎకరాల సర్వేలో సుమారు 60 ఎకరాల్లో చెరువు, 20 ఎకరాల్లో కాలువలు, మరో 20 ఎకరాలు పడావు భూములు, పదెకరాల్లో రోడ్లు విస్తరించి ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
"325 సర్వేనంబరులోని 388 ఎకరాల భూమిలో మేము బాధితులం. గత 50 సంవత్సరాలుగా మా భూములకు పట్టాలున్నాయి. అక్కడే భూములను లెవల్ చేసి, బోర్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. తర్వాత అక్కడ రిజర్వాయర్ రావడంతో మా భూములను కోల్పోయాం. దీంతో మాకు వేరే చోట భూములు కేటాయిస్తామన్నారు. తర్వాత గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాలను నిలిపివేశారు. దీంతో రైతు బంధు, బీమా రావడం లేదు. రుణమాఫీ కాలేదు. వీలైనంత వేగంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం" - బాధిత రైతులు
రైతు సంక్షేమ పథకాలకు దూరం
వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి తమకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని ఎర్రవల్లి రైతులు కోరుతున్నారు. పాసుబుక్కు లేక ప్రభుత్వం నుంచి అందే రైతు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని కర్షకులు వాపోతున్నారు. ఈ సర్వేతోనైనా తమ సమస్య తీరుతుందనే ఆశలో సాగుదారులు ఉన్నారు.
"ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు ఇక్కడి రైతులకు నోటీసులిచ్చి ఈ ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు. దాదాపుగా 60 నుంచి 70 మంది రైతులు సర్వే పూర్తి చేసుకున్నారు. దశల వారీగా కబ్జాలో ఉన్న రైతుల భూములకు సర్వే నిర్వహిస్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత ఇక్కడి రైతులను ఆన్లైన్ నుంచి తొలగించారు. దీంతో రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలు అందలేదు" - స్థానికులు
మిగిలిన వారందరికీ మరోమారు నోటీసులు
రెండో దశలో నోటీసులు అందుకున్న రైతుల సర్వే పూర్తి కాగానే చివరి విడతగా మిగిలిన వారందరికీ మరోమారు నోటీసులు ఇవ్వనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
కేసీఆర్ ఫామ్‌హౌస్ శివారు భూముల్లో రెండో రోజు సర్వే - రెవెన్యూ రికార్డులపై అధికారుల దృష్టి
రైతులకు నోటీసులు జారీ చేస్తున్న అధికారులు - వివరాలు తెలియజేయాలని వెల్లడి

