ETV Bharat / spiritual

శని దోషాలు తొలగించి వివాహ యోగం కలిగించే మద్ది ఆంజనేయస్వామి- ఈ మహిమ గల క్షేత్రం ఎక్కడుందో తెలుసా?

పశ్చిమ గోదావరి జిల్లాలోని గురువాయిగూడెంలో వెలసిన మద్ది ఆంజనేయస్వామి క్షేత్ర విశేషాలు- మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుగా వెలసిన హనుమ- ఈ స్వామివారిని దర్శిస్తే వివాహం ఆలస్యమవుతున్న వారికి శుభ ఫలితాలు

Anjaneya Swamy
Anjaneya Swamy (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 20, 2026 at 4:54 AM IST

4 Min Read
Choose ETV Bharat

Maddi Anjaneya Swamy Temple History: శ్రీరామభక్త హనుమకు దేశవ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. శని భగవానుడు హనుమకు ఇచ్చిన వరం ప్రకారం ప్రతి శనివారం హనుమను దర్శించి ప్రదక్షిణాలు చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగుతాయని విశ్వాసం. ప్రత్యేకించి ఒక క్షేత్రంలో గర్భాలయ శిఖరంపై చెట్టు తొర్రలో వెలసిన హనుమ దర్శిస్తే అన్ని రకాల శనిదోషాలు తొలగడంతో పాటు అవివాహితులకు శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుందని విశ్వాసం. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మద్ది ఆంజనేయస్వామి
ఒక చేత్తో గద, మరో చేత్తో పండు పట్టుకుని ముందుకు అడుగు వేస్తున్నట్లుగా దర్శనమిచ్చే హనుమ స్వయంభువుగా వెలసిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని గురువాయి గూడెంలో ఎర్రకాలువ ఒడ్డున వెలసి ఉంది. ఒక అసురుని భక్తికి మెచ్చి ఇక్కడ ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో హనుమంతుడు మద్ది చెట్టులో కొలువై ఉండి పూజలందుకోవడం విశేషం. కేవలం దర్శించి ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన్నే అభీష్టాలు నెరవేర్చే మద్దిలేటి ఆంజనేయ స్వామి క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
రావణాసురుని సైన్యంలో మధ్వాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. సీతాదేవిని అన్వేషిస్తూ లంకను చేరుకున్న హనుమ పరాక్రమాన్ని చూసిన ఆ రాక్షసుడు హనుమ భక్తునిగా మారి నిత్యం ఆరాధిస్తుండేవాడు. అయితే శత్రుపక్షంలో ఉండడం వల్ల హనుమను నేరుగా దర్శించే అవకాశం లేక, యుద్ధంలో హనుమకు ఎదురుగా వెళ్లి వీరమరణం పొందాడు. ఈ రాక్షసుడే ద్వాపర యుగంలో మధ్వకుడిగా జన్మించాడు. ఈసారి కూడా కౌరవుల పక్షాన పోరాడిన ఈ రాక్షసుడు యుద్ధంలో వీరమరణం పొందే ముందు అర్జునుని రథంపై ఉన్న జెండాలో హనుమను చూసి తనువు చాలిస్తాడు.

మధ్వ మహర్షిగా
ఆ రాక్షసుడే కలియుగంలో మధ్వ మహర్షిగా జన్మించి గురువాయి గూడెంలో ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి హనుమ సాక్షాత్కారం కోసం ఎర్రకాలువ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండేవాడట! ఇలా ఎన్నో ఏళ్లు గడిచాయి. ఒకరోజు రోజుమాదిరిగానే స్నానం చేసి ఒడ్డుకు వస్తున్న మహర్షి వయోభారంతో తూలి పడబోగా ఒక వానరం వచ్చి మహర్షికి ఆసరా ఇచ్చి నిలబెట్టి అరటిపండు ఇచ్చి ఆకలి తీర్చిందంట! ఇలా కొన్నాళ్ల పాటు ప్రతి రోజూ ఇలాగే జరగసాగింది. కొంతకాలానికి తనకు సహాయం చేస్తున్నది సాక్షాత్తు హనుమే అని మహర్షి గుర్తించాడు. అప్పుడు ఆనంద పరవశంతో మహర్షి హనుమకు నమస్కరించగా హనుమ ప్రత్యక్షమై మహర్షిని వరం కోరుకోమన్నాడు.

మద్ది చెట్టు తొర్రలో హనుమ ఈ విధంగా వెలిశాడు!
మధ్వ మహర్షి హనుమను తనతోనే శాశ్వతంగా ఉండిపోవాలని వరం కోరుకున్నాడంట! అప్పుడు హనుమ మధ్వమహర్షిని మద్ది చెట్టుగా మారిపొమ్మని వరమిచ్చి తాను ఆ మద్దిచెట్టు తొర్రలో స్వయంభువుగా వెలిశాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కొంతకాలానికి హనుమ ఓ భక్తురాలికి స్వప్న సాక్షత్కారం ఇచ్చి తన ఉనికిని తెలిపాడు. ఆ భక్తురాలు అక్కడకు వెళ్లి చూడగా ఒక చేతిలో గద, మరో చేతిలో పండుతో హనుమ దర్శనమిచ్చాడు. అప్పుడు ఊరందరు కలిసి హనుమకు మద్దిచెట్టు చుట్టూతా గర్భాలయాన్ని నిర్మించి తదనంతర కాలంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు.

మద్ది హనుమ ఆలయ విశేషాలు
గర్భగుడికి శిఖరంపై ఉండే మద్ది చెట్టు తొర్రలో దర్శనమిచ్చే హనుమ దర్శనం భక్తులకు అద్వితీయమైన అనుభూతినిస్తుంది. ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, వివాహం ఆలస్యం అయ్యేవారు తమ సమస్యను హనుమకు విన్నవించి 21 ప్రదక్షిణలు చేసి, సమస్య తొలగిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ! మొక్కులు తీర్చుకునే భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పరమాన్నం తయారు చేసి స్వామి నివేదించి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టి స్వీకరించడం ఆనవాయితీ! ఇందుకోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

పూజోత్సవాలు
మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం తమలపాకు పూజ, ప్రతి శనివారం పంచామృతాభిషేకం విశేషంగా జరుగుతాయి. ప్రతి మాసంలో స్వామి జన్మనక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం రోజు జరిగే సువర్చలా సమేత ఆంజనేయ స్వామి కల్యాణంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఇక ఈ ఆలయంలో హనుమజ్జయంతి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కార్తిక మాసంలో ఎంతో మంది భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించి ఈ ఆలయానికి తరలి వచ్చి ఇరుముడిని సమర్పిస్తారు.

ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. మనం కూడా మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. తరిద్దాం.
జైశ్రీరామ్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

జ్యేష్ఠ లక్ష్మి ప్రవేశించిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదా? పురాణాలు చెప్పే రహస్యం ఇదే!

శ్రీశైలంలో తపస్సు చేసి మల్లికార్జునిలో ఐక్యమైన మహా భక్తురాలు- అక్కమహాదేవి జీవిత విశేషాలివే!