యోగ, ధ్యానం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదు- సంపూర్ణ జీవనశైలి- యోగాతో శరీరానికి ఆరోగ్యం- ధ్యానంతో మనసుకు ప్రశాంతత- రోజుకు 5 నిమిషాల ధ్యానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది!

Published : June 21, 2026 at 12:31 AM IST
International Yoga Day 2026 : 'యోగా' ఆరోగ్యానికే కాదు ఆనందాన్నిచ్చే ఒక అద్భుత సాధనం. యోగా సాధనలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ, ఇందులో ప్రధానమైనది ధ్యానం. ఒక క్రమ పద్దతిలో ధ్యానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసుకు పూర్తిస్థాయి విశ్రాంతిని ఇస్తుంది. మనస్సును అదుపులో ఉంచి, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపం, భయం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జూన్ 21, ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ సులువుగా చేసుకోగలిగే ధ్యానం ఆవశ్యకత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ధ్యానం ఒక క్రియ కాదు ఒక ఆవశ్యక గుళిక
నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి లేని వారంటూ ఎవరూ లేరు. విద్యార్థులకు చదువుల ఒత్తిడి, యువతకు ఉద్యోగాల అనిశ్చితి, పనిఒత్తిడి ఆందోళన, మధ్యవయసు వారికి కుటుంబ జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృద్ధులకు అనారోగ్య సమస్యలు, ఒంటరితనం, ఇలా ఈ ఆధునిక యుగంలో ఒత్తిడి అందరికీ ప్రియనేస్తం అయింది. ధ్యానం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఆవశ్యక గుళికగా మారింది.
యోగా వ్యాయామం కాదు!
యోగా అనేది వ్యాయామం కాదు. ఇది ఒక జీవనశైలి. ఒక క్రమ పద్దతిలో మన శరీరాన్ని, మనసును నియంత్రించే అద్భుత సాధనం. అందమైన శరీరాకృతి కోసం, ఆరోగ్యం కోసం యోగాసనాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం ఎంతో అవసరం.
వేగం కన్నా శ్వాస మిన్న
ఈ కృత్రిమ మేధ ప్రపంచంలో ఎవరికీ శ్వాస తీసుకునే సమయం కూడా ఉండడం లేదు. ఇక ధ్యానం చేసే సమయం ఎక్కడుంది అంటారా! మొబైల్ ఫోన్లతో, సామాజిక మాధ్యమాల్లో నిత్యం గడుపుతూ యాంత్రికమైన ఈ జీవితంలో గందరగోళానికి గురైన మనసు ఎప్పడు అలిసిపోయిన స్థితిలోనే ఉంటోంది. ఈ అలసటకు అద్భుతమైన ఔషధమే ధ్యానం.
ధ్యానం ఎక్కడ చేయాలి?
ధ్యానం ఎక్కడో కొండల్లో, కోనల్లో, సముద్ర తీరాల్లో చేసేది కాదు. ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు. ఇందుకోసం గంటల కొద్దీ సమయం అవసరం లేదు. ధ్యానం కోసం కేవలం 5 నిమిషాలు చాలు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 5 నిమిషాలు ధ్యానం చాలు. ఆధ్యాత్మిక గురువులు మానవాళికి అందించిన అపురూపమైన ఔషధం ఇది.
ధ్యానం ఎలా చేయాలి?
ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ధ్యానం చేయడం మంచిది. ముందుగా మనసును ప్రశాంతంగా ఉంచుకుని కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అయితే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ యోగా గురువులు మాత్రం ముసిరే ఆలోచనలు ఆపాల్సిన అవసరం లేదని అంటారు. ఆలోచనలు నియంత్రించడానికి ఇష్టమైన దైవాన్ని కానీ, ఇష్టమైన దృశ్యాన్ని కానీ మనః ఫలకం మీద ఊహించుకుంటే సరిపోతుంది. క్రమంగా ఆలోచనలు అవే తగ్గిపోతాయి. ఈ చిన్న అలవాటు మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది.
ధ్యానం ఆధ్యాత్మికత మేళవిస్తే!
నిజానికి ఈ రోజు ధ్యానమని మనం చెప్పేది మన పురాణాల్లో మహర్షులు, నేటికీ సత్సంప్రదాయాన్ని పాటించే వారు ఆచరించే సంధ్యావందనం. ఇతర ఆలోచనలు రాకుండా ఉండడానికి ధ్యానంలో 'ఓంకారాన్ని' జపించడం మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
అద్భుత ధ్వని
ఓంకార నాదం దీర్ఘతరంగాన్ని పోలిన అద్భుత ధ్వని. పరమేశ్వరుని ఢమరుకం నుంచి ఉద్భవించిన ప్రణవాన్నే ఓంకారం అంటారు. ఒక క్రమ పద్ధతిలో ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు శరీరంలో ప్రత్యేకమైన కంపనాలు ఏర్పడుతాయి. నాభి నుంచి ప్రారంభమై పొట్ట, ఊపిరితిత్తులు, కంఠం, శిరసుపై ఈ కంపనాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మెదడులోని నరాలు శాంతిస్తాయి. ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. ఓంకార ధ్వని శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజితం చేసి ఏకాగ్రతను పెంచి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని ఎన్నో పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
కుల మతాలకు అతీతం
ఓంకారం కులమతాలకు అతీతమైన ఒక శక్తినాదం. ఈ విశ్వజనీనమైన ఓంకారంతో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు యోగా చేయని వారు ఈ రోజు నుంచి ధ్యానంతో మీ యోగా సాధనకు శ్రీకారం చుట్టండి. ఈ యోగా దినోత్సవం రోజు మనం కూడా ధ్యానం చేద్దాం. యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. చివరగా ఓంకార నాదంతో ధ్యానం చేద్దాం, విశ్వచైతన్యానికి నాంది పలుకుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
యోగా పితామహుడు పతంజలి మహర్షి ఎవరు?- ఆయన బోధించిన అష్టాంగ యోగ రహస్యాలేంటి?
శని దోషాలు తొలగించి వివాహ యోగం కలిగించే మద్ది ఆంజనేయస్వామి- ఈ మహిమ గల క్షేత్రం ఎక్కడుందో తెలుసా?

