రావి చెట్టును ఎలా పూజించాలి? శని దోషాలను తొలగించే అశ్వత్థ వృక్ష మహిమ గురించి తెలుసా?
సనాతన సంప్రదాయంలో పవిత్ర వృక్షంగా పూజలందుకునే రావిచెట్టుకు శని దేవునితో ప్రత్యేక సంబంధం ఉందని విశ్వాసం- శనివారం రోజున రావి చెట్టును విధిగా పూజించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని నమ్మకం

Published : June 6, 2026 at 2:55 AM IST
How to Worship the Peepal Tree for Shani Dosha : వృక్షాలను, నదులను దేవత స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. సనాతన సంప్రదాయం ప్రకారం కొన్ని వృక్షాలు దేవత వృక్షాలుగా పూజలందుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది రావిచెట్టు. రావిచెట్టుకు శనిదేవుని అవినాభావ సంబంధముంది. రావిచెట్టును పూజిస్తే శని బాధలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే రావిచెట్టును ఎలా పూజించాలి? ఏ సమయంలో పూజించాలి? వంటి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రావిచెట్టు విశిష్టత
రావి చెట్టు భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం, ఆధ్యాత్మికతలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన వృక్షం. దీనిని సంస్కృతంలో అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ చెట్టును సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా కొలుస్తారు. పద్మపురాణం ప్రకారం రావిచెట్టు లోని ప్రతి అణువులోనూ శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడని తెలుస్తోంది.
రావిచెట్టు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
రావిచెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరి భాగంలో శివుడు కొలువై ఉంటారని నమ్ముతారు. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఈ చెట్టు కిందనే జరిగిందని చరిత్ర చెబుతుంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. అయితే వాస్తురీత్యా రావిచెట్టు ఇంట్లో పెంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయాల్లో ఎక్కువగా రావిచెట్లను పెంచుతారు.
శని దోషాలు తొలగించే రావిచెట్టు
శనివారం రోజున రావి చెట్టును పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అయితే ఈ పూజ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలో చూద్దాం. శనివారం సంధ్యా సమయంలో రావిచెట్టు మొదట్ల నీరు పోయాలి. పసుపు కుంకుమ వేసి భక్తితో నమస్కరించుకోవాలి. అనంతరం రావిచెట్టు మొదట్లో ఒక ప్రమిదను ఉంచి అందులో ఆవనూనె కానీ, నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయాలి. తరువాత రావిచెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వలన శని దోషాలు తొలగుతాయని విశ్వాసం.
ఆంజనేయస్వామికి అశ్వత్థ పత్రాల పూజ
రావి ఆకులను అశ్వత్థ పత్రాలు అని కూడా పిలుస్తారు. హనుమంతుడికి ఈ మాల సమర్పించడం శని దోష నివారణకు ఒక రామబాణం వంటిది. ఈ పూజ కోసం 11, 21, 54 లేదా 108 రావి ఆకులను తీసుకోవాలి. ఆకులు ఎక్కడా చిరగకుండా, తాజాగా ఉండాలి. ప్రతి ఆకుపై గంధం లేదా కుంకుమతో శ్రీరామ అని రాయాలి. హనుమంతుడు రామనామ ప్రియుడు కాబట్టి, ఇది అత్యంత ముఖ్యం! ఈ ఆకులను ఒక దారంతో మాలగా గుచ్చాలి. శనివారం రోజున ఈ మాలను హనుమంతుని గుడిలో స్వామి వారి మెడలో వేయాలి.
హనుమకు శని ఇచ్చిన వరం
పురాణాల ప్రకారం, శని దేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శనివారం హనుమంతుని పూజిస్తారో, వారిని తాను ఇబ్బంది పెట్టనని. అందుకే ఏలినాటి శని లేదా అష్టమ శని ఉన్నవారు ఈ మాల సమర్పిస్తే దోష తీవ్రత తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది. హనుమ ఆలయంలో రావి ఆకుల మాల సమర్పించేటప్పుడు 'అంజనీ గర్భ సంభూతం కపీంద్రం సచివోత్తమం| రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా!' అనే మంత్రాన్ని పఠించడం విశేష ఫలితాన్నిస్తుంది.
రావిచెట్టులో ఔషధ గుణాలు
రావిచెట్టు లోని ప్రతి భాగం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. రావిచెట్టు ఆకులు, బెరడు, కాయలను ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. రావిచెట్టు ఆకులు, కాయలు ఆస్తమా, దగ్గు, డయేరియా చర్మ వ్యాధుల చికిత్సలో వాడతారు. రావిచెట్టు బెరడు దంతాల నొప్పి, చిగుళ్ల సమస్యలు తగ్గిస్తుంది. పూజలు, సంప్రదాయాల పేరుతో మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి అంశం వెనుక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయత కూడా దాగి ఉంది. అంతేకాదు 'వృక్షో రక్షతి రక్షితః ' అంటూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను కూడా తెలియజేస్తుంది. మనం కూడా ప్రతి శనివారం రావిచెట్టును పూజిద్దాం ఇటు శని దోషాలను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షిద్దాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
శ్రీవారి శుక్రవారం అభిషేకంలో పునుగుపిల్లి ప్రాధాన్యత ఏంటి? ఈ మూగ జీవికి దక్కిన అపూర్వ భాగ్యం ఏంటి?
పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం కళ్లముందు కనిపించే ఆలయం- ఎక్కడుందో తెలుసా?

